KCR Focus On Manifesto
BRS Manifesto – CM KCR : తెలంగాణలో మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా పథకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 16న వరంగల్ లో నిర్వహించే సభలో మేనిఫెస్టోను ప్రకటించేందుకు రెడీ అవుతోంది అధికార పార్టీ. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజలందరికీ వైద్య బీమాని అమలు చేసే అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా పరిశీలిస్తోంది.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు..
కర్నాటక ఎన్నికల్లో 5 గ్యారెంటీ స్కీమ్స్ తో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారెంటీలను ప్రకటించింది. రెండుసార్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీని ఎదుర్కొనేందుకు పథకాలే అస్త్రంగా ముందుకు సాగుతోంది హస్తం పార్టీ. తాము ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దాదాపు 20 రోజులుగా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
జాతీయ స్థాయిలో పార్టీలను ఇబ్బంది పెట్టేలా కేసీఆర్ వ్యూహం..
ఇక 2014, 2018 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన వాటితో పాటు కొత్త పథకాలను అమలు చేసి ప్రజలకు చేరువైంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అభివృద్ది, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ అని చెబుతున్న గులాబీ నేతలు జాతీయ స్థాయిలో పార్టీలను ఇరకాటంలో పెట్టేలా పావులు కదుపుతున్నారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే జాతీయ పార్టీలకు ధీటుగా మరోసారి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్.
వివిధ రంగాల నిపుణులతో కేసీఆర్ చర్చలు..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్కీమ్ లో కొన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అవి కాకుండా మరికొన్ని కొత్త పథకాలు ప్రకటించింది హస్తం పార్టీ. కొత్తగా ప్రకటించిన స్కీమ్స్ కు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది అన్న అంశంపై ఆరా తీస్తున్న గులాబీ పార్టీ అందుకు ప్రత్యామ్నాయ పథకాలను సిద్ధం చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు వారాలుగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపకల్పనపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రైతు బంధు రూ.15వేలకు పెంపు? ఆసరా పెన్షన్లు పెంపు?
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తమ వద్ద బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే మేనిఫెస్టోలో ఎలాంటి అస్త్రాలను తెరపైకి తీసుకొస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. రైతుబంధు పథకంలో ప్రస్తుతం ఎకరాకి రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తుండగా.. దీన్ని 12వేల నుంచి రూ.15వేల వరకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఆసరా, వితంతు పెన్షన్లను పెంచడంతో పాటు రైతులకు కూడా పెన్షన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పేదలందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్?
పేదలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత వైద్య బీమాను అందించేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకొచ్చి రూ.10లక్షల వరకు వైద్య బీమా అందించే విధంగా ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ఇటీవలే మంత్రి హరీశ్ రావు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు గ్యాస్ సిలిండర్ ధరలో సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఓ పథకాన్ని రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యువతకు లబ్ది జరిగేలా..
ఇక కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి కలిసి రాకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందకపోవడం వల్లే గత మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతిని అమలు చేయలేకపోయామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ, ఈసారి కొత్త స్కీమ్ ద్వారా మరింత మంది యువతకు లబ్ది చేకూరేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాము విడుదల చేసే మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరుగుతుందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మరికొన్ని కొత్త పథకాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమైంది.
అక్టోబర్ 2వ వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 16న వరంగల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడే మేనిఫెస్టోని ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది.