Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. బీసీలకు రిజర్వేషన్ల అంశంపై.. న్యాయ నిపుణులతో భేటీ అయ్యే ఛాన్స్..

అభివృద్ధికి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.

CM Revanth Reddy

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ హైకమాండ్ తో భేటీ కానున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ఇప్పటికే మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ సమావేశమై బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించింది. ఇక ఇదే అంశంపై సీఎం రేవంత్ న్యాయ నిపుణులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఉదయం ఓయూకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మంత్రుల కమిటీ వేశారు. 42శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది.

వారికి ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాబోతోంది. 42శాతం రిజర్వేషన్ల ఇవ్వడంలో టెక్నికల్ గా ఏమైనా అడ్డంకిగా మారతాయా అని పరిశీలిస్తోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఒక ఆప్షన్ కాగా, కేంద్రం అమలు చేసినప్పుడే రిజర్వేషన్లు ఇవ్వడం రెండో ఆప్షన్. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు అత్యవసరం.

అభివృద్ధికి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తోంది. పార్టీ పరంగా అయినా రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలి అనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

ఇలా వెళ్లడం ద్వారా లీగల్ గా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేదానిపై చర్చించేందుకు ఎక్స్ పర్ట్స్ తో సీఎం రేవంత్ మాట్లాడబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్తున్నారు.

Also Read: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. త్వరలోనే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు:కేటీఆర్