పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. త్వరలోనే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు:కేటీఆర్
ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

KTR
KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. 20 నెలల పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని అన్నారు.
ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. “2018లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీకి క్యాబినెట్ ర్యాంక్ తో సమానమైన ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చాం.
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేశాం. శేరిలింగంపల్లిలో రూ.9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నాం. మొన్నటి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు బీఆర్ఎస్‌ని అశీర్వదించారు.
కేసీఆర్‌ని చూసి శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. జిల్లాలో మాత్రం కాంగ్రెస్ మాయ మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారు.
Also Read: ఈ ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు అన్నీ వారం రోజుల్లో వచ్చేస్తున్నాయ్.. ఆర్ యూ రెడీ..
ఎవరి అభివృద్ధి కోసం అరికెపూడి గాంధీ పార్టీ మారారు? ఆయన అభివృద్ధి కోసమే పార్టీ మారారు. 18 నెలల కాలంలో అరికే పూడి చేసిన అభివృద్ధి ఏంటి? ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేను పరిస్థితి. తొందర్లోనే పార్టీ మారిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి సత్తా ఏంటో తెలుస్తుంది.
అరికెపూడి గాంధీ.. తల్లి లాంటి పార్టీ పాలు తాగి రొమ్ము మీద కొట్టాడు. బై ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కు బాయ్ బాయ్ చెప్తారు తెలంగాణ ప్రజలు. పార్టీని పునఃనిర్మాణం చేసుకుందాం.. డివిజన్ల వారీగా కొత్త కమిటీలు వేసుకుందాం” అని కేటీఆర్ (KTR) అన్నారు.
“కరోనా సమయంలో రూపాయి ఆదాయం లేకపోయినా ఆభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేసుకున్నాం.
ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంపాదన పెంచే తెలివి లేక అప్పులు ఉన్నాయని చూపిస్తూ ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల కడుపు కొడుతున్నారు. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు.
హైడ్రాకి పేదల ఇల్లు కనిపిస్తాయి తప్ప రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు మాత్రం కనబడదు. విచ్చలవిడిగా ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తున్నారు” అని కేటీఆర్ మండిపడ్డారు.