Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు జిల్లాల ప్రజలకు శుభవార్త..

Telangana Govt : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధి చేసే గ్రోత్‌ కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలని పేర్కొన్నారు.

CM Revanth Reddy

  • అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
  • ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు
  • నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్‌

Telangana Govt : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం ఉండాలని, ఈ ప్రాంతాల్లో అవసరమైతే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు డిజైన్ చేయాలని సూచించారు.

Also Read : Laxman Kumar Adluri: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

రాష్ట్రంలో మెగా గ్రోత్ కరిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధి చేసే గ్రోత్‌ కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాలని, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా.. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్‌ను, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలని అన్నారు.

కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని అన్నారు.

ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, రింగ్ రోడ్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలతో పాటు ఇతర అంశాలన్నీ గ్రోత్ కారిడార్లలో స్పష్టంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు, పనులు చేపట్టాలని, వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారుతాయని, ఆ విమానాశ్రయానికి కావాల్సిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలని సూచించారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌ను రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుందని సీఎం రేవంత్ చెప్పారు. గ్రోత్ కారిడార్లలో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ స్పష్టంగా డిజైన్ చేయాలని అన్నారు.

నగరాల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీ వాహనాలే ఉండాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు ఉండాలని, మున్సిపాలిటీలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని, ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

నగరాలు, పట్టణాల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏఐ వినియోగం కోసం సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాల పైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.