CM Revanth Reddy Japan Tour : తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy Japan Tour

CM Revanth Reddy Japan Tour: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు జపనీస్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

 

కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. జపాన్ పర్యటనలో రెండు సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్ తో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది.

 

తెలంగాణలో నైపుణ్యం కలిగిన నిపుణులకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు జపనీస్ సంస్థల ద్వారా 500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నారు. హెల్త్ కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగంలో 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో 100 ఉద్యోగాలు లభించనున్నాయి.