బీఆర్ఎస్ కుట్రతోనే కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఓడిపోయింది.. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy (Photo Credit : Google)

CM Revanth Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. వంద రోజుల పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం పెరిగింది. మా రెఫరెండంకు ప్రజలు మద్దతు తెలిపారని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ గెలుపుకోసం పోరాడిన కార్యకర్తలకు అభినందనలు తెలిపిన రేవంత్.. కార్యకర్తలు మా గౌరవాన్ని నిలబెట్టారు.

Also Read : మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. టీడీపీకి మంత్రి పదవులు ఎన్నంటే?

బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేశారు. బీజేపీ గెలుపుకోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని రేవంత్ విమ‌ర్శించారు. ఏడు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో హరీష్ రావుకి పూర్తి పట్టున్నప్పటికీ తమ ఓట్లు బీజేపీకి వేయించారు. బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఓడిపోడిందని రేవంత్ అన్నారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాలేదు. చిల్లర మల్లర కారణాలు చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా పోషించాలని రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గుండుసున్న ఇచ్చారు. బీఆర్ఎస్ చస్తూచస్తూ బీజేపీని బతికించింది. బీఆర్ఎస్ నాయకుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టాడని రేవంత్ విమ‌ర్శించారు. కేసీఆర్ చేస్తున్న దుర్మార్గాన్ని సెక్యులర్ ఫోర్సెస్ గమనించాలి. బీఆర్ఎస్ పార్టీకి బూడిద నే మిగిలింది. ఆ బూడిద తీసుకొని మీ బావకి, నాన్నకి పూయాలంటూ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుండి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకుండా ఉండడం ఇదే మొదటిసారి అని రేవంత్ అన్నారు.

Also Read : జగన్ ఓటమికి ప్రధాన కారణం అదే.. చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలి : సీపీఐ నారాయణ

మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మా తో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు తిరస్కరించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలని రేవంత్ అన్నారు.

ఈరోజు నుండి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తాం. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా నాదే బాధ్యత. గెలుపు ఓటములు నేనే బాధ్యత తీసుకుంటా. మాకు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాగా ఉన్నాయి. వాటిని స్వీకరిస్తున్నాను. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నాడు. ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ సూచించారు. కేసీఆర్ రాజకీయ జూడగాడు. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్, ఆయనతో బీజేపీ స్నేహం ఎలా చేస్తోందంటూ రేవంత్ ప్ర‌శ్నించారు. ఏపీలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ఏపీతో ఉన్న ఆస్తులు, నీటి పంపకాలను చర్చించి పరిష్కరించుకుంటామ‌ని రేవంత్ పేర్కొన్నారు.