ప్రధాని మోదీ, చంద్రబాబు, నేను అక్కడ చదువుకున్న వాళ్లమే- సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మిస్తాం. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అందరూ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు.

Cm Revanth Reddy : గత పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. సర్కార్ బడుల విలువ తెలుసు కాబట్టే విలువ ఇస్తున్నామన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, నేను.. మేమంతా ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా.. పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులే కారణం అని పేర్కొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. విద్యకు కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జీతాలకే వెళ్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు సీఎం రేవంత్.

ప్రభుత్వ పాఠశాలలు ఎవరికి తీసిపోవు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారని ప్రశంసించారు. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులు.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి ప్రతిభ చాటినందుకు గర్వపడుతున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు 90శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదుకున్న వారే అని ఆయన చెప్పారు.

”ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ప్రతిభను స్ఫూర్తిగా తీసుకోవాలి. గత పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. విద్యార్థులు లేరని బడిని మూసివేస్తున్నారు. టీచర్ లేకపోతే విద్యార్థులు ఎలా వస్తారు? సింగిల్ టీచర్ బడులను సైతం నడిపిస్తాం. ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తోంది. మెగా డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేస్తాం. దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చాం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ద్వారా విద్యార్థులను బడికి పంపించే భాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనం చూసే బాధ్యత మహిళా గ్రూప్ లకు ఇచ్చాం. గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. అమ్మఒడి విద్యార్థులకు పాఠశాలగా ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ కారణంగా తల్లిదండ్రులతో పిల్లల సంబంధాలు దెబ్బతింటున్నాయి. త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మిస్తాం. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అందరూ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. 10/10 తెచ్చుకున్న విద్యార్థులందరి ఉన్నత విద్యకు ప్రభుత్వం సహకరిస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Also Read : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ.. అధిష్టానం పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు!

ట్రెండింగ్ వార్తలు