తెలంగాణ అప్పుల పాలైంది, రూ.7 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టి పోయారు- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అప్పుడు ఏడాదికి ఆరున్నర వేల కోట్ల అప్పు కట్టేవాళ్లం, ఇప్పుడు 7వేల కోట్లు నెలకు వడ్డీలే కడుతున్నామని, సంవత్సరానికి 70వేల కోట్లు వడ్డీ కట్టడానికే అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పదేళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా అమ్ముకుని ఊడ్చి పెట్టేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పెట్టి పోయారన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏం చేద్దామన్నా అప్పులే కనిపిస్తున్నాయని వాపోయారు. ఏ గూట్లో చెయ్యి పెట్టినా అప్పుల కాగితాలే చేతికొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు ఏడాదికి ఆరున్నర వేల కోట్ల అప్పు కట్టేవాళ్లం, ఇప్పుడు 7వేల కోట్లు నెలకు వడ్డీలే కడుతున్నామని, సంవత్సరానికి 70వేల కోట్లు వడ్డీ కట్టడానికే అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా సరే ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ పోతున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

”మీలో ఒకడిగానే నేను ఉంటున్నా. ముఖ్యమంత్రి అయ్యాక నాకు కొమ్ములు వచ్చినట్లు నేను ఏనాడైనా అలా ప్రదర్శించానా? ఇంటికి వచ్చే వాళ్లతో మాట్లాడుతున్నా కదా. అందరినీ కలుస్తున్నా కదా.. కొన్ని అవుతాయి, కొన్ని కావు. పదేళ్లు ఏమీ చేయేనోళ్లు, ఉన్నదంతా అమ్ముకుని ఊడ్చిపెట్టుకుని వెళ్లిపోయినోళ్లు, 7లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తిమీద పెట్టి దివాళా తీపించారు. ఏం చేద్దామన్నా అప్పులే. ఏ గూట్లో చెయ్యి పెట్టినా అప్పుల కాగితాలే బయటకు వస్తున్నాయి. పొద్దున లేచినప్పటి నుంచి అప్పులోళ్లు ఇంటి ముందు ఉంటున్నారు. బాకీ ఉన్నావు అప్పు కడతావా లేదా అంటున్నారు. గతంలో ఏడాదికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండె. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి ప్రతి నెల 1వ తేదీన 7వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం.

ఏడాది తిరిగేలోపు 72వేల కోట్లు వడ్డీ కట్టడానికే అవుతుంది. ఇదీ పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అంటే.. మీ అందరికీ లెక్కలు తెలియాలి. సంసారం అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనక ముందు అయినా.. మీరంతా ఓపికగా గ్రామాల్లో చెప్పాలి. వచ్చే ఎన్నికలు మీవే. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలు, జనం మోసినోళ్లు. సర్పంచ్ లను, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. మనందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని నడిపించుకుందాం, అభివృద్ది చేసుకుందాం” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : తెలంగాణలో బలపడేందుకు టీడీపీ పక్కా వ్యూహం? ఆ పార్టీలోకి నామా?

ట్రెండింగ్ వార్తలు