Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్.. సారీ చెప్పాలని డిమాండ్
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం.
Padi Kaushik Reddy Representative Image (Image Credit To Original Source)
- ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారం
- మతాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలు చేయడం అత్యంత ఖండనీయం
- ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ (ఐపీఎస్) పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారం అంది. మతాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలు చేయడం అత్యంత ఖండనీయమని వ్యాఖ్యానించింది.
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు విధులు నిర్వహిస్తున్న పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యగా ఐపీఎస్ అధికారుల సంఘం అభివర్ణించింది. దీన్ని సివిల్ సర్వీసుల స్వతంత్రత, గౌరవంపై దాడిగా అభిప్రాయపడింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం. ఐపీఎస్ అధికారుల గౌరవం కాపాడేందుకు సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: పెద్ద ప్లానే..! సడెన్గా దానం నాగేందర్ యూటర్న్.. కారణం అదేనా?
వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉదయం అసెంబ్లీ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. జాతరలో ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతలను దర్శించుకుంటున్న సమయంలో కరీంనగర్ జిల్లా సీపీ, హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐ తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
