నీళ్లు కావాలని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే.. అదీ మా విశ్వసనీయత: సీఎం రేవంత్

గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలని ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్, హరీశ్ రావును అడిగినా లాభం లేదనే వారు అడగలేదు.

cm revanth reddy laucnhed sita rama lift irrigation project

CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడకేశాయని, పాలమూరు ప్రజలు వలస వెళ్లడానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును గురువారం ఆయన ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి అంకితం చేశారు. రెండవ పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించి, స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

”గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలని ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్, హరీశ్ రావును అడిగినా లాభం లేదనే వారు అడగలేదు. ఇప్పుడు నీళ్లు కావాలని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే.. మా విశ్వసనీయతకు నిదర్శనం. సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయడానికి సహకరిస్తాం. పదేళ్లు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ లు ఇవ్వకుండా కాలం గడిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు పెంచింది. ఖర్చు పెట్టింది 7,500 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను 40 శాతం లోపే పూర్తి చేసింది. మోటార్లు బిగించి నాలుగేళ్లయింది, కరెంట్ బిల్లు కూడా కట్టలేదు. మా ప్రభుత్వం వచ్చాక మోటార్లను క్రమబద్దీకరించాం.

Also Read : అక్కడ తప్పకుండా ఉపఎన్నిక వస్తుంది, బీజేపీతో కలిసుంటే కవిత జైల్లో ఎందుకుంటుంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వకముందే రైతులు భూములు ఇచ్చారు. మా ప్రయత్నాన్ని చులకన చేయాలని హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టును పదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేదు? ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తాం. ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. 80 శాతానికి పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అప్పులకు వడ్డీ కట్టేందుకే మేం అప్పులు తెస్తున్నామ”ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.