రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం.. పంపిణీని ప్రారంభించిన సీఎం

తెలంగాణలో అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు.

CM Revanth Reddy

తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు ఇకపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం కూడా అందనుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభ నుంచి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలిసి ప్రారంభించారు.

అలాగే, సుమారు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయి. ఉచిత సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు రూ.40 వరకు ఖర్చు చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని అందుకోవచ్చు.

Also Read: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. రెండో ఓటమి బాధలో కెప్టెన్‌ కమిన్స్‌ ఏమన్నాడంటే?

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు.

అప్పట్లో రూ.1.90కే కిలో బియ్యం ఇవ్వాలని తొలుత కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి భావించారని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయని, సర్కారు మారడంతో ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. 1957లోనే కాంగ్రెస్ పార్టీ రేషన్‌కార్డు దుకాణాలు ప్రారంభించిందన్నారు.

మంత్రి కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్‌ సర్కారు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు మూడు రంగుల కార్డులను అందించనుందని అన్నారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. 80 శాతం మందికిపైగా ప్రజలకు సన్నబియ్యం అందిస్తామని అన్నారు.