మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. రెండో ఓటమి బాధలో కెప్టెన్‌ కమిన్స్‌ ఏమన్నాడంటే?

ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఓటమి ఎదురైంది. విశాఖ మ్యాచులో రాణించలేకపోయింది.

మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. రెండో ఓటమి బాధలో కెప్టెన్‌ కమిన్స్‌ ఏమన్నాడంటే?

Pic: @BCCI

Updated On : March 30, 2025 / 8:01 PM IST

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాళ విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ ముందు నుంచీ ధాటిగా ఆడింది. 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

ఢిల్లీ బ్యాటర్లలో ఫాప్‌ డుప్లెసిస్ 50, జేక్ ఫ్రేజర్ 38, కేఎల్ రాహుల్ 15, అభిషేక్ పొరెల్ 34 (నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు తీశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జీషాన్ అన్సారీ 3 వికెట్లు తీశాడు.

అంతకుముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 1, ట్రావిస్ హెడ్ 22, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 0,
అనికేత్ వర్మ 74, హెన్రిచ్ క్లాసెన్ 32, అభినవ్ మనోహర్ 4, పాట్ కమిన్స్ 2, వియాన్ ముల్డర్ 9, హర్షల్ పటేల్ 5, షమీ 1 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 5, కుల్దీప్‌ యాదవ్‌ 3, మోహత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ పాట్ కమిన్స్‌ స్పందిస్తూ.. తాము ఢిల్లీకి భారీ టార్గెట్‌ను ఇవ్వలేకపోయామని చెప్పాడు. కొన్ని తప్పుడు షాట్లు ఆడామని తెలిపాడు. అయితే, బౌండరీల వద్ద ఫీల్డర్లు క్యాచులు పట్టడం ఈ ఫార్మాట్‌లో సాధారణమేనని తెలిపాడు.

గత రెండు మ్యాచుల్లోనూ సరిగ్గా ఆడలేకపోయామని అన్నాడు. తాము వీటిపై సమీక్ష జరుపుకుని బాగా ఆడడానికి ఉన్న ఇతర ఆప్షన్లపై దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపాడు. రెండు ఓటములకే బాధపడిపోవడం సరికాదని, మళ్లీ పుంజుకుంటామని చెప్పాడు.

టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరిని అనికెట్ వర్మా బాగా ఆకర్షించాడని పాట్ కమిన్స్‌ అన్నాడు. అతను ప్రాక్టీస్ గేమ్స్, నెట్ సెషన్లలో బాగా ఆడాడని తెలిపాడు. ఇవాళ్లి మ్యాచ్‌లో బాగా ఆడి, జట్టుకు గెలిచేందుకు కొద్దిపాటి అవకాశాలనూ సృష్టించాడని అన్నాడు. ఈ మ్యాచులో అనికేత్ వర్మ 74 పరుగులు బాదాడు.