Revanth Reddy: రేషన్‌ కార్డులు ఉన్న పేదలకు త్వరలోనే ఇవి కూడా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy

రేషన్‌ కార్డులు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం కూడా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణ పేట జిల్లా చంద్రవంచలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రామసభల ద్వారా రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. గ్రామసభల ద్వారా అధికారులను పంపిస్తున్నామని తెలిపారు.

Also Read: కొత్త రేషన్ కార్డుల తుది జాబితాలో మీ పేరు రాలేదా.. అయితే ఇలా చేయండి..

గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని బీఆర్ఎస్‌ పాలనను ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.

తమ సర్కారు ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. తమ పార్టీ హామీ ఇచ్చిదంటే దానిపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ ఆ హామీని నెరవేర్చారని చెప్పారు.

బీఆర్ఎస్‌ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాని దుస్థితిని ఏమనాలని నిలదీశారు.

మరి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే ఆ పదవిలో ఎందుకు ఉన్నట్లని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలోని అందరూ పదవులు పొందినట్లు, తమ ఇంట్లో వారు పదవులు పొందలేదని తెలిపారు.