TG Ration Cards: కొత్త రేషన్ కార్డుల తుది జాబితాలో మీ పేరు రాలేదా.. అయితే ఇలా చేయండి..
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు.

TG Ration Cards
TG Ration Cards: తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. వీటిలో కొత్త రేషన్ కార్డు జారీ ఒకటి. రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకోసం గ్రామ సభలు నిర్వహించి వివరాలను అధికారులు సేకరించారు. మరికొందరు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు వారికి రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. అయితే, అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Also Read: Rythu Bharosa: వీరి ఖాతాల్లోకే ‘రైతు భరోసా’ డబ్బులు.. అర్హత ఉండి నగదు రానివారు ఇలా చేయండి..
ఇప్పటికే అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించిన సమయంలో, ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇటీవల గ్రామసభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేవంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సభలో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే అదే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోనివారు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చడం జరిగిందని, అందులో పేరులేని వారుసైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్లయ్ చేశారా..? ఫైనల్ లిస్ట్ ఎప్పుడు.. ఎలా చెక్‌చేసుకోవాలంటే..
ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉండికూడా పేరు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. ఇదిలాఉంటే.. పనులన్నింటిని పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.
కొత్త రేషన్ కార్డుకోసం అర్హతలు..
దరఖాస్తుదారు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
మీకు ఇప్పటికే రేషన్ కార్డు ఉంటే, మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయలేరు.
కొత్తగా పెళ్లయిన వారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ గడువు ముగిసిన తరువాత కూడా కొత్త రేషన్ కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
పేద వర్గాల్లోని ప్రజలు రేషన్ కార్డు కోసం అర్హులు.
అవసరమైన పత్రాలు..
నివాస ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు
మీరు ఉండే గ్రామం లేదా పట్టణం, ఇంటి చిరునామా వివరాలు.
పాస్ పోర్టు సైజు ఫొటో
ఫోన్ నెంబర్
వార్షిక ఆదాయం ధృవీకరించే పత్రం.
రేషన్ కార్డు ధరఖాస్తు ఫారమ్ మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. లేదా మీరు నేరుగా రేషన్ కార్డు నమోదుకు దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మీ సేవా అధికారిక వెబ్ సైట్ (https://ts.meeseva.telangana.gov.in/) లోకి వెళ్లండి..
హోం పేజీలో మీరు డౌన్లోడ్ల ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఆపై అప్లికేషన్ ఫారమ్ లు ఎంపికపై క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత ‘సవిల్ సప్లయ్’ (Civil Supplies)పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫారమ్ ల జాబితా మీ స్క్రీన్ పై కనపడుతుంది. అందులో మీరు ‘అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్’ ఎంపిక పై క్లిక్ చేయాలి.
మీకు క్లిక్ చేసిన తరువాత తెలంగాణ రేషన్ కార్డు అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకొని.. అందులో వివరాలు నమోదు చేయాలి.
మీ దరఖాస్తుపై నమోదు చేసిన వివరాలు, అర్హత పత్రాలను జతచేయాలి.
సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లి నామమాత్రపు రుసుముతో దరఖాస్తు ఫారమ్ సమర్పించాలి.
దరఖాస్తు ఫారమ్ ను మీసేవా కేంద్రంలో అందజేసిన తరువాత రసీదు తీసుకోవాలి.
మీరు కొత్త రేషన్ కార్డుకోసం చేసుకున్న దరఖాస్తు స్థితి గురించి తెలుసుకునేందుకు ఆన్ లైన్ లో తనిఖీ చేయొచ్చు.
ఇందుకోసం https://epds.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
FSC సెర్చ్ అని ఉంటుంది.. దానిపై క్లిక్ చేయాలి.
FSC రేషన్ కార్డు సెర్చ్ ఓపెన్ అవుతుంది.
దానిలో సెర్చ్ విభాగంలో FSC (ఆహార భద్రత కార్డు) కోసం, FSC అప్లికేషన్ కోసం అని ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తరువాత దానిలో FSC సూచన సంఖ్య, రేషన్ కార్డు నెంబర్, పాత రేషన్ కార్డు నెంబర్, జిల్లా పేరు నమోదు చేయాలి.
తద్వారా మీ కార్డు ఏ కేటగిరిలో ఉందో తెలుస్తుంది.
అయితే, ఈ జాబితాలో మీరు పేరు, మీ దరఖాస్తు ఫారమ్ ఏ స్థితిలో ఉందనే వివరాలు లేకుంటే గ్రామ, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలి.