పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కోదండరాం, వామపక్షాల నేతలతో సీఎం రేవంత్ భేటీ

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.

Teenmar Mallanna: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం నేత ఎస్ వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. చివరి రోజు ప్రచార సరళిపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు.

తీన్మార్ మల్లన్న గెలవాలి: కూనమనేని
”నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలి. ఇవాల్టితో ప్రచార ప్రక్రియ పూర్తవుతోంది. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామ”ని కూనమనేని సాంబశివరావు అన్నారు.

మార్పు కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి: కోదండరాం
”బీజేపీ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాం. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపించాలి. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నాం. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాన”ని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

Also Read: బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా తుడిచేస్తున్న సీఎం రేవంత్.. ఏం చేస్తున్నారో తెలుసా?

కాంగ్రెస్‌కు మద్దతు సీపీఎం మద్దతు: వీరయ్య
”ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతోంది. విద్యాధికులు లోతుగా ఆలోచించాలి. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాల”ని సీపీఎం నేత ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు