బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా తుడిచేస్తున్న సీఎం రేవంత్.. ఏం చేస్తున్నారో తెలుసా

తన మార్క్ పాలనను చూపించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా తుడిచేస్తున్న సీఎం రేవంత్.. ఏం చేస్తున్నారో తెలుసా

Cm Revanth Reddy : ఎన్నికలు ముగియగానే పరిపాలనపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాలను అమలు చేస్తూనే ప్రగతిపై నజర్ పెట్టారు. గత ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా తుడిచేస్తున్నారు సీఎం రేవంత్. తన మార్క్ పాలనను చూపించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

పరిపాలనలో సీఎం రేవంత్ దూకుడు..
సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ తో పరిపాలనలో దూకుడు పెంచారు. అప్పటి పథకాలకు కొత్త రూపు ఇస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్కీమ్ లను అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పుడు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీటిలో గత సర్కార్ అమలు చేసిన రైతు బంధునే రైతు భరోసాగా మార్చారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఇందిరమ్మ ఇండ్లుగా మార్పించేశారు. ఇక నాటి ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులకు పెన్షన్లు ఇవ్వనుంది.

పాత పథకాలకు మెరుగులు.. టీఎస్ స్థానంలో టీజీ..
కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలకు మెరుగులు దిద్దడమే కాదు.. కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుడుతోంది. అమ్మ ఆదర్శ కమిటీలను తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యతలను గ్రామాల్లోని మహిళా గ్రూపులకు అప్పగించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చింది.

6 పాలసీలతో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ..
అలాగే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ పాటకు పట్టం కట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోను సైతం జూన్ 2 తెలంగాణ దశాబ్ది సంబురాల నుంచి అమల్లోకి తీసుకురానుంది. గత సర్కార్ తెలంగాణ పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ ను అమలు చేసింది. దీనికి బదులుగా రేవంత్ సర్కార్ 6 పాలసీలను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎంఎస్ఎంఈ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలనీ, ఎక్స్ పోర్ట్స్ పాలసీ.. ఇలా సెక్టార్ల వారీగా పరిశ్రమల కల్పన మరింత సులభంగా ఉండే విధంగా రేవంత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

మొత్తానికి పథకాల అమల్లో గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఫల్యాలు లేకుండా నూతన ఒరవడితో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ? కీలక శాఖల్లో మార్పులు, చేర్పులు..? కారణం అదేనా

పూర్తి వివరాలు..