CM Revanth Reddy: ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు: రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు.

CM Revanth Reddy

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో గవర్నర్​పేట్​ టు గవర్నర్స్​ హౌస్​ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని తెలిపారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని చెప్పారు.

మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

అనుభవజ్ఞుల నుంచి తమ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పట్లో నంద్యాలలో పీవీ పోటీ చేసినపుడు తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్టీఆర్ పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టలేదని అన్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని తెలిపారు. తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు.

Nellore District Political Scenario : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?

ట్రెండింగ్ వార్తలు