CM Revanth Reddy
లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా 14 సీట్లు గెలిచితీరాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల మ్యానిఫెస్టోకు సెంటిమెంట్‌ను జోడించింది. గత పదేళ్లలో పెండింగ్ లిస్ట్‌కు పరిమితమైన విభజన హామీలనే ఆయుధంగా చేసుకుంది హాస్తం పార్టీ. దీన్నే వెపన్‌గా పార్లమెంట్ పోరులో బీఆర్ఎస్, బీజేపీని కార్నర్ చేయనుంది. ఇదే సీఎం రేవంత్ స్కెచ్‌లా కనిపిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను దక్కించుకోవాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్..అందుకు పూర్తి సరంజామాను సిద్ధం చేసుకుంటోంది. బీఆర్ఎస్, బీజేపీలను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి… కాంగ్రెస్‌కు 14 సీట్లు తగ్గకుండా గెలవాలని ఫిక్స్ అయ్యారు. లోక్‌సభ పోరుకు తెలంగాణ సెంటిమెంట్‌ను జోడించి…ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
స్పీడుకు బ్రేకులేయాలి..
తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాలంటే బీఆర్ఎస్, బీజేపీ స్పీడుకు బ్రేకులేయాలి. సరిగ్గా దీనికోసమే… తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ . ముఖ్యమంత్రిగా… పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లను డిఫెన్స్‌లోకి నెట్టాలన్నదే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
దీనిలో భాగంగా 2014 ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఆయుధంగా మలుచుకుని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు. వీటిని ప్రశ్నించడం ద్వారా పదేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌లను రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చని రేవంత్ స్కెచ్ వేశారు.
హామీలు అమలు చేస్తాం..
హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టు, పాలమూర్- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాకర్టీ, మైనింగ్ యూనివర్శిటీలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత… నాడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటోంది కాంగ్రెస్.
అంతేకాదు సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్, హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, హైదరాబాద్‌లో నీతిఅయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చింది. తెలంగాణ తమ పేటెంట్‌గా చెప్పుకునే కేసీఆర్‌కు అదే సెంటిమెంట్‌తో ఆయుధాన్ని సంధించబోతోంది కాంగ్రెస్. మరి ఈ సెంటిమెంట్ అస్త్రం కాంగ్రెస్‌కు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.