CM Revanth Reddy : ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’.. బీఆర్ఎస్ స్వేద పత్రంపై రేవంత్ ఘాటు రియాక్షన్

ఏడాది తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని, కొద్దిరోజుల్లో కొత్త బోర్డ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని, ఆ విధంగా టీఎస్పీఎస్సీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

CM Revanth Reddy

Congress Prajapalana Telangana 2023 : ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ప్రజా పాలన కార్యక్రమం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి సీఎం విడుదల చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభయ హస్తం ఆరు గ్యారెంటీ హామీకి ప్రజల ఆమోదం పొందాయన్నారు. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన వేదికగా మిగతా హామీలకు దరఖాస్తులు తీసుకుంటున్నామని, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అభయ హస్తం అమలు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని రేవంత్ అన్నారు.

Also Read : అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

రేపటి (28వ తేదీ) నుంచి ప్రజా పాలన ప్రారంభమవుతుందని, జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.. లక్షణం అన్నారు. ప్రజలకు పదేళ్లు ప్రభుత్వం దూరంగా ఉండిపోయింది.. ప్రజావాణిలో 24వేల దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం అని రేవంత్ అన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లేందుకు, ప్రజలకు విశ్వాసం కల్పించేందుకే ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో గడీల లోపల జరిగిన పాలనను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజలకు మేలు చేసేందుకే ప్రజా పాలన కార్యక్రమం అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు రెండు గ్రామ సభలు నిర్వహిస్తామని, గ్రామ సభలో ఇవ్వలేక పోయినా.. గ్రామ పంచాయితీల్లో సెక్రెటరీలకు దరఖాస్తు ఇవ్వొచ్చని, రేషన్ కార్డు లేనివారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. గడీల పాలనను గ్రామాల్లోకి తీసుకొస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం అయిందని, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు ట్రాకింగ్ ఉంటుందని అన్నారు.

Also Read : Karimnagar’s Most Wanted : ఆహా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. కరీంనగర్‌ల ఎవ్వడు ఎవ్వడి మీద తోపు కాదు అన్న..

ఏడాది తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. కొద్దిరోజుల్లో కొత్త బోర్డ్ ఏర్పాటు చేస్తామని, పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని, ఆ విధంగా టీఎస్పీఎస్సీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారంకాలేదని ఓ మహిళ కేటీఆర్ ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు కేటీఆర్ లక్ష సాయం అందించారు. కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లలో బాధితురాలికి లక్ష ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలాచేస్తామని రేవంత్ అన్నారు. అసెంబ్లీలో బావబామ్మర్థుల తాపత్రేయం కనిపించిందని, కానీ విషయం లేదు అందుకే సభలో సమాధానం చెప్పలేక పోయారని అన్నారు. బీఆర్ఎస్ విడుదల చేసింది స్వేద పత్రం కాదు.. వాళ్లది ప్రజల రక్తపు కూడు అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సార్.. ఖజానాను ఊడ్చేశారు.. అందుకే శ్వేతపత్రం విడుదల చేశామని రేవంత్ అన్నారు. కేసీఆర్ హయాంలో 22 కొత్త కార్లు కొన్నారు. విజయవాడలో పెట్టారు. ఒక్కోదానికి 3కోట్లు వెచ్చించారు. ఇవే కేసీఆర్ సంపాదించిన ఆస్తి అంటూ రేవంత్ అన్నారు.

కాళేశ్వరంపై జుడీషియల్ విచారణలో అన్ని బయటకు వస్తాయని రేవంత్ తెలిపారు. ప్రధాని మోదీని కలిసిన విషయంపై మాట్లాడుతూ.. మాకు ఎలాంటి రహస్య అజెండా ఉండదు. తెలంగాణ ప్రజల అవసరాలపై ప్రధానితో మాట్లాడాం. ప్రధాని సానుకూలంగా స్పందించారని రేవంత్ అన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం ఉండకూడదనే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పామని రేవంత్ తెలిపారు.