Karimnagar’s Most Wanted : ఆహా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. కరీంనగర్‌ల ఎవ్వడు ఎవ్వడి మీద తోపు కాదు అన్న..
కరీంనగర్ లో దందాలు, మాఫియా, బ్యాంక్ మోసాలు లాంటి కల్పిత అంశాలతో 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' సిరీస్ తెరకెక్కింది.

Aha OTT Karimnagar's Most Wanted Web Series Review and Rating
Karimnagar’s Most Wanted : ఇటీవల అన్ని ఓటీటీలు లోకల్ గా చాలా వెబ్ సిరీస్ లు తీసుకు వస్తున్నాయి. తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తెస్తూనే ఉంది. కొత్త సిరీస్ లు, కొత్త షోలు, సినిమాలతో ఆహా ఓటీటీ ప్రేక్షకులని అలరిస్తుంది. తాజాగా ఇటీవల ఆహా ఓటీటీలో ‘కరీంనగర్ మోస్ట్ వాంటెడ్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. డిసెంబర్ 22 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
సాయి సూరేపల్లి, అమన్, అనిరుధ్, గోపాల్ ముఖ్య పాత్రల్లో స్ట్రీట్ బీట్స్ బ్యానర్ నిర్మాణంలో రమేష్ ఎలిగేటి కథ, మాటలు అందించగా బాలాజీ భువనగిరి దర్శకత్వంలో ఈ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్ తెరకెక్కింది. కరీంనగర్ లో దందాలు, మాఫియా, బ్యాంక్ మోసాలు లాంటి కల్పిత అంశాలతో ఈ సిరీస్ ని తెరకెక్కించారు.
‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ కథ.. గని (సాయి సూరేపల్లి), టింకు (అమన్ సూరేపల్లి) బ్రదర్స్. బిట్టు (అనిరుద్ తుకుంట్ల), సత్తి (గోపాల్ మాదారం).. ఇలా నలుగురు ఫ్రెండ్స్. ఈ నలుగురు బిజినెస్ కోసం లోన్ అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వడంతో డబ్బు అవసరమయి లోన్ రికవరీ ఏజెంట్లుగా మారతారు. ప్రతి వారం తమకు కమిషన్ ఇచ్చే బ్యాంకు మేనేజర్ ఓ వారం మోసం చేయడంతో ఆ పని మానేసి 30 లక్షలు కూడబెట్టి ఓ ల్యాండ్ కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడే నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయడంతో ఏం చేయాలో పాలుపోక ఆ నోట్లు తీసుకొని బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళతారు. నోట్లు ఛేంజ్ చేయడానికి మరణించిన వ్యక్తుల పేర్లతో దొంగ అకౌంట్స్ ఓపెన్ చేసి తమ డబ్బుని మార్చుకుంటారు ఈ నలుగురు కుర్రాళ్లు. కానీ ఆ తర్వాత ఆ అకౌంట్స్ నుంచి 5 కోట్లు మారడంతో పోలీసులు ఈ ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వీరే అని నలుగురిని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ లో అయిదు కోట్లు ఎవరు మార్చారు? జైల్లో నలుగురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జైలు నుంచి వచ్చాక కరీంనగర్ బ్లాక్ మార్కెట్ లో ఎలా ఎంటర్ అవుతారు? కరీంనగర్ లో ఈ నలుగురు మాఫియాలో ఎలా ఎదుగుతారు అనేది ఆహా ఓటీటీలో చూడాల్సిందే.
‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్ విశ్లేషణ.. మాఫియా నేపథ్యంలో ఇటీవల పలు సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. అందులో ఇప్పుడు ఇది కూడా చేరింది. అయితే ఇది మన దగ్గర్లో ఉన్న కరీంనగర్ లో కథ అని చూపించడంతో కొంచెం లోకల్ ఫ్లేవర్ ఉంటుంది. నలుగురు కుర్రాళ్ళు సిరీస్ ని ముందుండి నడిపిస్తారు. ముఖ్యంగా గని పాత్ర లీడ్ తీసుకొని మాఫియా లీడర్ గా ఎదిగిన విధానం చూపిస్తారు. ఈ సిరీస్ లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. కరీంనగర్ లో బతుకు తెరువుకు ఏదో ఒక పని చేయాలనుకునే కుర్రాళ్ళు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కొని జైలుకు వెళ్లివచ్చిన తర్వాత మాఫియాలో ఎలా ఎదిగారు అనే ఒక హీరోయిజంతో కథ నడిపించారు. సిరీస్ లో కమర్షియల్ అంశాలు జోడించారు. కామెడీ మొదట్లో కొన్ని చోట్ల వర్కౌట్ అయినా తర్వాత మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. జైలు నుంచి గని బయటకు వచ్చిన తర్వాత తీసిన సీన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పాలి. ఆర్టిస్టులు కొత్తవాళ్లు అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి చక్కటి నటన రాబట్టుకున్నారు. నలుగురు కొత్త కుర్రాళ్ళు అయినా బాగానే నటించారు అని చెప్పొచ్చు. ఇలాంటి బలమైన కథకి ఇంకొన్ని పవర్ ఫుల్ సీన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇందులో మనిషి స్వార్థంతో పాటు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఏ విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తారనేది కూడా చూపించారు. ఇక ఇది సీజన్ 1 అని ప్రకటించగా దీనికి కొనసాగింపుగా సీజన్ 2 కూడా అంటుందని తెలుస్తుంది.
Also Read : Tripti Dimri : బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన ‘యానిమల్’ భామ?
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ఈ సిరీస్ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ అనడంతో చాలా సీన్స్ అక్కడ కరీంనగర్ లోనే తీయడం ప్లస్ అయింది. లొకేషన్స్ అన్ని న్యాచురల్ గానే అనిపిస్తాయి. అక్కడి యాసకు తగ్గట్టు డైలాగ్స్ రాసుకోవడం, కరీంనగర్ పేరుని వాడటంతో మొత్తానికి ఈ టీం కరీంనగర్ ని బాగానే వాడుకున్నారు అనిపిస్తుంది. బలగం సినిమాకి రచయితగా పనిచేసిన రమేష్ ఎలిగేటి ఈ సినిమాకి రచయితగా పనిచేసారు. దానికి ఎమోషనల్ టచ్ ఇస్తే ఈ సిరీస్ కి మాత్రం మాస్ టచ్ ఇచ్చారు. ఒక సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. లీడర్ గా ఎదిగే క్రమంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పవర్ఫుల్ గా ఇచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కెమెరా విజువల్స్ కూడా లొకేషన్స్ కి తగ్గట్టు ఉన్నాయి. కొత్త నటులు, చిన్న సిరీస్ అవ్వడంతో దానికి తగ్గ నిర్మాణ విలువల్లోనే డైరెక్టర్ బాలాజీ భువనగిరి కమర్షియల్ అంశాలు జోడించి మంచి సిరీస్ తీశారని చెప్పొచ్చు. సిరీస్ దర్శకత్వంలో రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. డైరెక్టర్ ది కరీంనగర్ కాకపోయినా ఆ ఏరియాను అందంగా చూపించడం, ఆ ఏరియా సబ్జెక్టు, డైలాగ్స్ డీల్ చేయడం చేశారు డైరెక్టర్ బాలాజీ భువనగిరి. ఇక ఆహా ఓటీటీ ఒక కంటెంట్ తెస్తుంది అంటే దాంట్లో ఎంతో కొంత విషయం ఉందనే అర్ధం. అలా ఈ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్ ని కూడా ఆహా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.
మొత్తంగా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్ మాఫియా లాంటి కథలు చూసేవాళ్ళు, రెగ్యులర్ గా సిరీస్ లు చూసేవాళ్ళు ఆహా ఓటీటీలో చూసేయొచ్చు.
Dark Deeds, Hidden Schemes.?
Watch Karimnagar’s Most wanted on aha! ▶️https://t.co/Fl2Z823g6c#CrimeSeries #PremiereAlert #KMWwebseries #StreetBeatzCinemaProduction @rahulmahesh80 @AnirudhTukuntla @DopRahul @vijaycuts @Pardhu_creative #Karimnagar #aha #Webseries pic.twitter.com/vtHRpGhULF— ahavideoin (@ahavideoIN) December 22, 2023