Cm Revnath Reddy : హిందువుల ఆస్తులను ముస్లింలకు ఎలా ఇస్తారు?- ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్

దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వారిని పొలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలి.

Cm Revnath Reddy : దేవుడు, మతం పేరుతో రాజకీయ వ్యాపారం చేసే వారిని తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాముడి పేరుతో ఎంతకాలం రాజకీయం చేస్తారు? అంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. హిందువుల ఆస్తులను ముస్లింలకు ఇస్తారని దేశ ప్రధాని మాట్లాడటం గౌరవమా..? అని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే ఆస్తులు పంచుకుంటారని వ్యాఖ్యానించారు. హిందువుల ఆస్తులను ముస్లింలకు ఎలా రాసిస్తారని నిలదీశారు. అంబేద్కర్ రాజ్యాంగంపైన ప్రమాణం చేసి మోదీ ఇలా మాట్లాడతారా..? అని అడిగారు. మేడ్చల్ జనజాతర బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవడానికి ప్రయత్నిస్తుంటే కమ్యూనిస్టుగా చెప్పుకునే ఈటల ఓట్లు ఎలా అడుగుతావు..? బీజేపీ నేతలకు దయ్యం పట్టుకుంది. రాముడి పేరు మీద ఎంత కాలం రాజకీయాలు చేస్తారు? దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. అలాంటి వారే అసలైన హిందువులు. నేను హిందువును.. దేవుడిని నమ్ముతా.. ఎవరి ధర్మం, ఎవరి జాతి వారిదే.. గౌరవించుకోవడం వారి హక్కు.. రాజ్యాంగం ఇచ్చిన అధికారం. కమ్యూనిస్టుగా ఈటల రాజేందర్ ముసుగు తొడుకున్నాడు. దేవుడిపైన రాజకీయాలను చేసే వారిని పొలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలి. వివేకంతో వ్యవహారించాలి. వివాదాలతో సంక్షేమాన్ని దెబ్బతీయొద్దు.

పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా నన్ను కార్యకర్తలే ముందుండి గెలిపించారు. మల్కాజ్ గిరి అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేశాను.. కొన్ని సమస్య లను పరిష్కరించ గలిగాను. ప్రస్తుతం మల్కాజ్ గిరి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పరాయి వాళ్ల చేతిలో ఉన్నాయి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వాళ్లు ఎంపీగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. చేవెళ్లలో సునీతా మహేందర్ రెని పోటీ చేయాల్సింది. కానీ నేనే అధిష్టానానికి చెప్పి మల్కాజ్ గిరి బరిలో దింపాను. మహేందర్ రెడ్డి 35ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సుపరిచితులు. మల్కాజ్ గిరి పరిధిలో ఆనాడు దేవేందర్ గౌడ్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు.

కేసీఆర్ తన బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నారు. అందులో మల్కాజ్ గిరి సీటు కూడా ఉంది. మల్కాజ్ గిరి లో బీఆర్ఎస్ అభ్యర్థిగా డమ్మినీ పెట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రపూరిత, కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టాలి. కేసీఆర్ బీఆర్ఎస్ ను మోడీకి తాకట్టు పెట్టారు. మోడీ, కేసీఆర్ ఇద్దరినీ ఓడించాలి. అసెంబ్లీలో కేసీఆర్ ను బొందపెట్టారు. పార్లమెంటులో మోదీని ఓడించాలి.

బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈటల రాజేందర్ కేంద్రం నుంచి హుజూరాబాద్ కు నిధులు తీసుకొస్తే ఎందుకు ఆయనను ఓడించారు? మోడీ, అమిత్ షా నా చేతుల్లో ఉన్నారని ఈటల చెప్పుకుంటున్నారు. అమిత్ షా తో చెప్పి కేసీఆర్ అవినీతిని, కాళేశ్వరంపైన, హైదరాబాద్ భూములపైన, కేటీఆర్ అవినీతిపైన ఎందుకు ఈటల విచారణ చేయించలేదు…? బీజేపీ ఎమ్మెల్యేగా మూడేళ్లు ఉన్న ఈటల ఎందుకు కేసీఆర్ అవినీతిపైన ఫిర్యాదు చేయలేదు..? ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఏమిటి..? ఈటల రాజేందర్ ఎందుకు కేసీఆర్ అవినీతిపైన మాట్లాడటం లేదు. ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు స్పందించరు..? మోదీ ఇచ్చిన హామీలపై చర్చకు ఈటల రాజేందర్ సిద్ధమా..? మా మైనంపల్లిని చర్చకు పంపిస్తా.

మోదీ చెప్పింది 20కోట్ల ఉద్యోగాలు.. ఇచ్చింది 7 లక్షలు.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.. కానీ, వారి ఆత్మగౌరవాన్ని అదానీ, అంబానీకి తాకట్టు పెట్టారు. లక్షలాది మంది రైతులు కొట్లాడి మోదీ మెడలు వచ్చి క్షమాపణలు చెప్పించారు. కనీస మద్దతు ధర చట్టాన్నిఅమలు చేయకుండా రైతులను దోకా చేయలేదా..? ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలు 15 లక్షలు వేస్తామన్నారు. కనీసం 15 పైసలైనా వేశారా? మరి మోదీకి ఓటు ఎందుకు వేయాలి?

బీజేపీ పేదలకు ఇళ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేయలేదు. ఆకలి ఇండెక్స్ లో భారతదేశం 111 స్థానంలో ఉంది. మోడీ సిగ్గుతో తలదించుకోవాలి. మోడీతో కేసీర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు. బీఆర్ఎస్ కు వేసిన ఓటు మూసీలో వేసినట్లు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కు ఓటు వేయాలి. కేసీఆర్ మిమ్మల్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. ముఖ్యమంత్రిగా మల్కాజ్ గిరిని డెవలప్ చేసే బాధ్యత నాది. సునీతమ్మను ఎంపీగా గెలిపించండి. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదతా. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకొవస్తా.

తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. సంక్షేమ పథకాలను రద్దు చేయించే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ చేస్తోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలు ఆగవు. తొక్కుకుంటూ వెళ్లి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. అత్యధిక మెజార్టీతో సునీతమ్మను గెలిపించాలి. సునీతమ్మకు వేసే ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లు” అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

 

 

”హిందువుల ఆస్తులను గుంజుకుని ముస్లింలకు పంచి పెడతారంట. ఈ దేశ ప్రధాని మోదీ ఈ రకంగా మాట్లాడటం ఈ దేశ గౌరవమా? ఆస్తులు పంచాలంటే చట్ట ప్రకారం బదిలీ చేయాల్సిందే. అన్నదమ్ములు అయినా సరే ఆస్తులు పంచుకోవాలంటే చట్ట ప్రకారమే ముందుకెళ్లాలి. ఒకరి ఆస్తి మరొకరికి వెళ్లాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ ఎవరైనా దొంగ డాక్యుమెంట్లతో ఆస్తులు తీసుకున్నా, భూములు గుంజుకున్నా పోలీసులు వారి వీపులు పగలగొట్టి ఎవరి ఆస్తులు వారికి ఇస్తారు. ఇంత చట్టబద్దత ఈ దేశంలో ఉంది. మరి, ఎలా హిందువుల ఆస్తులను గుంజుకుని ముస్లింకు పంచి పెడతానని ప్రధాని మోదీ అంటారు?” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.

ట్రెండింగ్ వార్తలు