Cm Revanth Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు..

సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతోంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

Cm Revanth Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్ పేట గంగూబాయి బస్తీ, బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మరోసారి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతోంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. భారీ వర్షాల సమయంలో కాలనీల్లోని ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా నీటి ప్రవాహం జరిగి, ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించారు.

భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీ వాసులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారి సాధకబాధకాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు.

నిన్న కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ ఇవాళ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. అమీర్ పేట్ నుంచి మైత్రీవనం వైపు నడుచుకుంటూ వెళ్లారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అమీర్ పేట్ గంగుబాయి బస్తీలో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. మరోసారి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు హైడ్రా కమిషనర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మైత్రివనం బుద్ధనగర్ లో డ్రైనేజీ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించారు. బస్తీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తు ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని సీఎంకు స్థానికులు వివరించారు. వెంటనే డ్రైనేజీ సిస్టమ్ ను స్టీమ్ లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. అలాగే పక్కనే ఉన్న గంగుబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.