తండ్రీ కొడుకుల మధ్య సమన్వయం లేదు..! కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ ధ్వజం

పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Cm Revnath Reddy : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. తండ్రీ కొడుకుల మధ్య సమన్వయం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు అని కొడుకు కేటీఆర్ అంటే, కేసీఆర్ ఏమో ఆ వెంటనే సభకు వచ్చారు. వారిద్దరి మధ్య సమన్వయం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి సభలో ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

”కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదలకు కష్టాలు వచ్చాయని అంటున్నారు. పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలని నేను సూచన చేస్తే.. ఆయన రాడు మేమే వస్తాం, బావ బావమరదులమే సమాధానం చెప్తామని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడింది టీవీలో కేసీఆర్ చూసినట్లు ఉన్నారు. ఆ తర్వాతి రోజే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు.

కేటీఆర్ కు బాధ్యతలు ఇస్తే ఏం చేస్తాడో అనే భయంతో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు. కొడుకేమో రాడని అంటాడు, తండ్రేమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. వారి మధ్య సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజలను వంచించినందుకు కేసీఆర్ ను ఓడగొట్టి బుద్ధి చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చారు. ఇప్పటికీ వారి బుద్ధి మారలేదు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఉంటే.. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు దక్కేవి. కానీ, పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకు వచ్చే అవకాశం లేదు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : ఆయన సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు