Cold Weather
Cold Weather : తెలుగు రాష్ట్రాల్లో నిన్నమొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల మొంథా తుపాను తీవ్రత తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే, తాజాగా చలి తీవ్రత పెరిగింది.
వానాకాలం ఇట్ల పూర్తయిందో లేదో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాయంత్రం 5గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఇక ఉదయం వేళల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9గంటల వరకు చలి గజగజ వణికిస్తోంది. అదిలాబాద్ నుంచి కిందున్న జోగులాంబ గద్వాల్ జిల్లా వరకు చలి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. మరో 15రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది గత ఏడేండ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం అధికమైంది. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ 20 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్ లోనూ చలి గజగజ వణికిస్తుంది. ఉదయం 9గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటుంది. నగరం పరిధిలోని శంకర్ పల్లిలో అత్యల్పంగా 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని, రాత్రి, ఉదయం వేళల్లో బయటకు వచ్చేవారు చలి తీవ్రత నుంచి రక్షణ చర్యలు పాటించాల్సిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు ధరించాలి.
శరీరాన్ని వేడిగా ఉంచేందుకు గోరువెచ్చని నీరు, సూప్‌లు, పోషకాహారం తీసుకోవాలి.
వృద్ధులు, చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాత్రి, తెల్లవారు జామున సమయాల్లో బయటకు వెళ్లొద్దు.
ఒకవేళ రాత్రి, ఉదయం వేళ్లలో బయటకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది.