గ్రామస్తులను రెచ్చగొట్టింది ఇతడే..! లగచర్ల ఘటనలో సూత్రధారి రాఘవేందర్ సస్పెండ్‌..

ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై పోలీసు శాఖ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి.

Lagacharla Incident (Photo Credit : Google)

Lagacharla Incident : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ ఘటనలో సంగయ్య పల్లి గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు, రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టినట్లు వివరించారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను అటు ప్రభుత్వం, ఇటు పోలీసు శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. లగచర్ల ఘటనలో ఇప్పటికే దాడికి పాల్పడ్డ వారిలో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

మరోవైపు ఈ ఘటనలో అధికారుల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో విలేజ్ సెక్రటరీగా పని చేస్తున్న రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. లగచర్ల గ్రామ ప్రజలను, రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టాడని పోలీసుల దర్యాఫ్తులో తేల్చారు. దీంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రాఘవేందర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు కొనసాగిస్తున్నారు.

దౌల్తాబాద్ మండలంలోని సంగయ్యపల్లి విలేజ్ సెక్రటరీగా పని చేస్తున్న రాఘవేందర్ రావ్ భూములు కోల్పోతారు అంటూ గ్రామస్తులను రెచ్చగొట్టాడని, కలెక్టర్ పై దాడికి ఉసిగొల్పాడని పోలీసులు గుర్తించారు. అధికారులపై దాడిలో రాఘవేందర్ రావ్ ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తమ దర్యాఫ్తులో తేల్చారు. దాంతో కలెక్టర్ రాఘవేందర్ పై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసు శాఖ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి.

మరోవైపు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సైతం లగచర్ల గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులను కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేశారు.

 

Also Read : లగచర్ల వ్యవహారంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే స్పందించాలి: ఢిల్లీలో కేటీఆర్