Revanth
Congress: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ ఇంద్రవెల్లి వైపు కదులుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ(09 ఆగస్ట్ 2021) మధ్యాహ్నం రెండు గంటలకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ మొదలుకానుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపుతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు నేతలు. లక్ష మందితో దండోరా సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించేదిశగా ఈ సభ నిర్వహిస్తోంది.
ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే, నలభై ఏళ్ల క్రితం భూమి హక్కుల కోసం నినదిస్తూ 1981 ఏప్రిల్ 20న ఆదివాసీలు సభ నిర్వహించ తలబెడితే.. నాటి సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే, గిరిజనులు తమ హక్కుల కోసం కదం తొక్కారు. ఓ పోలీస్‌కు, ఆదివాసీ మహిళకు జరిగిన వివాదంతో ఇంద్రవెల్లిలో మారణకాండ జరిగింది. ఇప్పుడదే కాంగ్రెస్ దళిత, గిరిజన హక్కుల కోసం పోరాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద దళిత గిరిజన దండోర సభకు ఏర్పాట్లు చేసింది. అమరవీరుల స్తూపం సాక్షిగా దళిత- గిరిజనుల హక్కుల కోసం పోరాడతామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
సీఎం కేసీఆర్ తలపెట్టిన దళితబంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సుదీర్ఘ కార్యక్రమాన్ని చేపట్టింది టీ కాంగ్రెస్. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా దండోరా సభలు నిర్వహించనుంది. మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు నిర్వహించనుంది. సెప్టెంబర్‌లో మొదటివారంలో నిర్వహించనున్న సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు.
క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 8.30 గంటలకు గాంధీభవన్‌లో పతాకవిష్కరణ చేస్తారు రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత భారీ వాహన శ్రేణితో ఇంద్రవెల్లికి బయల్దేరతారు. రేవంత్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ దండోరా సభలో పాల్గొంటారు.
మళ్లీ పుంజుకోవాలి.. కారు పార్టీ జోష్‌కు బ్రేక్ వేయాలి.. ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలి.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద పని. దీని కోసమే హస్తం పార్టీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. దూరమవుతోన్న దళిత దండును కలుపుకుపోయేలా ఇంద్రవెల్లి సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు టార్గెట్‌లు విధించడంతో నేతలంతా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.