Bellaiah Naik
Bellayya Naik : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో స్పీడ్ పెంచింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి జాబితాలను విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ దసరా తరువాత రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు అధిష్టానం వద్ద తమకే టికెట్ కేటాయించాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.
మహబూబాబాద్ నియోజకవర్గం టికెట్ ఈ దఫా నాకే కేటాయించాలి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నా.. గతంలో నాకు మొండి చేయి చూపినా పార్టీని వీడలేదు.. వ్యతిరేకించలేదని బెల్లయ్య నాయక్ అన్నారు. మహబూబాబాద్ లో నేను గెలిచి చూపిస్తా.. ఓడిపోతే మళ్లీ టికెట్ అడగనని అన్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదని, ఈసారి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బెల్లయ్య నాయక్ కోరారు. బలరాం నాయక్ కి మూడు సార్లు అవకాశం ఇచ్చారు.. ఓడిపోయారని అన్నారు.
మహబూబాబాద్ లో నాకు ఓటు బ్యాంక్ ఉందని బెల్లయ్య నాయక్ అన్నారు. సీట్ల కేటాయింపు ఏఐసీసీ స్థాయిలో కాదు.. రాష్ట్ర నాయకత్వమే నిర్ణయిస్తున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా విడుదల చెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. సామాజిక న్యాయం అంటే సామాజిక వర్గాల వారిగా గెలిచే వారికి సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు.