MLC Addanki Dayakar
Addanki Dayakar: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఆయన రక్తం గులాబీ రంగులోకి మారిందంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తల్చుకుంటే మీకు నాయకత్వమే ఉండకపోయేది. కక్ష రాజకీయాలుచేస్తే అందరూ జైలుకు వెళ్లి దిక్కులేని పక్షులు అయ్యేవారు. కేటీఆర్ భాష చూస్తే ప్రవీణ్ కుమార్‌కు రక్తం మరగడం లేదా..? అంటూ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
అన్నం పెట్టే వారికి సున్నం పెట్టే కల్చర్ కేసీఆర్ కుటుంబానిది. సిట్ విచారణకు రానివాళ్లు సీబీఐ విచారణ కోరుతున్నారు. సీబీఐ అయితే బీజేపీ చెప్పినట్టు వింటుందని అనుకుంటున్నారని అద్దంకి అన్నారు. ప్రవీణ్ కుమార్ కు దొంగల పంచన చేరాల్సిన అవసరం ఏమిటి..? తప్పును తప్పుగా చూపెట్టాల్సిన జ్ఞానం ఏమైంది..? ప్రవీణ్ ఆత్మ గౌరవం ఎక్కడ తాకట్టు పెట్టాడు..? ప్రవీణ్ కుమార్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడా? నిజాలు మాట్లాడుతున్నారా..? అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని అద్దంకి దయాకర్ సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ బాధితుడు. కేటీఆర్ చెప్తే ఎవరు నమ్మడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రంగంలోకి దించాడు. కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ప్రవీణ్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ ప్రాపగాండా టీంలో ప్రధాన సభ్యుడిగా ఆయన చేరాడు. కేటీఆర్ లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో. తన ఫోన్ ట్యాప్ అయిందని కవిత కూడా చెబుతుంది. ప్రవీణ్ వెళ్లి కవితను కలిసి ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడాలి. అనవసరపు అబద్ధాలు చెప్తే క్రెడిబిలిటీ పోవడమే కాకుండా.. లీగల్‌గా కూడా అనేక సమస్యలు వస్తాయని దయాకర్ హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబంలోనివాళ్లే వాళ్ళ దోపిడిని తట్టుకోలేక బయటకి వచ్చి నిజాలు చెప్తున్నారు. కేసీఆర్ తరువాత కేటీఆర్ అని ప్రచారం చేసుకోవటంకోసం.. కేటీఆర్ రూ.650 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ అద్దంకి దయాకర్ ఆరోపించారు.
మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలకు ఎవరు చెప్పారు. మేం ఫోన్ ట్యాపింగ్ అనగానే వాళ్లు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. బీఆర్ఎస్ నేతలవి పిచ్చి వ్యాఖ్యలు. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని చేస్తున్న ప్రచారం. మంత్రుల మధ్య పంచాయితీలు పెట్టేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు. కవిత బయటకు వచ్చి తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పింది. మా మంత్రులు ఎవరైనా బయటకి వచ్చి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పారా..? అంటూ అద్దంకి దయాకర్ అన్నారు.