రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్న బీఆర్ఎస్.. నిధుల వేటలో రేవంత్‌రెడ్డి సర్కార్..

దసరాలోపు ఈ రెండు పథకాలకు నిధులను రిలీజ్ చేద్దామంటే ఖజానాలో డబ్బులు లేవని అంటున్నారు.

కాంగ్రెస్‌ పవర్‌లోకి వచ్చి పది నెలలు అయింది. ఎన్నికల్లో ఇచ్చిన అతిపెద్ద హామీ రుణమాఫీకి కీలక అడుగులు పడ్డాయి. కానీ హామీని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అంటోంది. ఇంకా కొంత పెండింగ్‌ ఉంది..అందరికీ మాఫీ చేస్తామని అధికారపక్ష చెప్తోంది. రుణమాఫీపై ఇన్నాళ్లు అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్ అన్నట్లుగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. బీజేపీ దీక్ష కూడా చేసింది. అయితే ఇప్పుడు రుణమాఫీ సెగ దేశ రాజధాని ఢిల్లీకి తాకేలా ఉంది.

అలాగని వెంటనే మిగతావారికి రుణమాఫీ నిధులు విడుదల చేద్దామంటే ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ సర్కార్ పెద్దలను ఆలోచనలో పడేసిందట. దసరా పండగ లోపు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోతే ఢిల్లీలో రాహూల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటోంది బీఆర్ఎస్.

20 లక్షల మంది రైతుల ఎదురుచూపులు?
దీంతో ఏం చేయాలన్న దానిపై రేవంత్ సర్కార్ సందిగ్ధంలో పడిందన్న చర్చ జరుగుతోంది. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు ఇంకా రుణమాఫీ అమలు కాలేదు. దీంతో దాదాపు 20 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. అంతే కాకుండా రైతుభరోసా డబ్బులను కూడా ప్రభుత్వం ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు.

భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. భూమిలేని రైతు కూలీలకు కూడా ఏడాదికి 12 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు రైతుభరోసా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దసరా తర్వాత ఢిల్లీ వెళ్లి రాహూల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్.

ఢిల్లీలో ధర్నా చేస్తే?
ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అన్నంత పని చేసి ఢిల్లీలో ధర్నా చేస్తే ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన రైతు రుణమాఫీ, రైతు భరోసా హామీల అంశం నేషనల్ ఇష్యూ అయిపోతుందని భావిస్తున్నారట.

అలాగని దసరాలోపు ఈ రెండు పథకాలకు నిధులను రిలీజ్ చేద్దామంటే ఖజానాలో డబ్బులు లేవని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకానికి కలిపి కనీసం 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలు కావాలని అంచనా వేస్తున్నారు. కానీ తెలంగాణ సర్కార్ ఖజానాలో అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై రేవంత్ సర్కార్ చర్చోపచర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం.. వేటుకు వేళైందా? కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతోనే ఏఐసీసీ రియాక్ట్?