కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం.. వేటుకు వేళైందా? కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతోనే ఏఐసీసీ రియాక్ట్?
అక్కినేని అమలతో ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్‌లో మాట్లాడి జరిగిన విషయంపై ఆరా తీసినట్లు..

Konda Surekha
Konda Surekha: ఆమె ఓ రాష్ట్రమంత్రి. అంతో ఇంతో ఇమేజ్ ఉన్న మహిళా లీడర్. ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో అందరికీ టార్గెట్ అయిపోయారు. కేటీఆర్ మీద అటాక్ చేయబోయి.. ఆమె చిక్కుల్లో పడిపోయారు. కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగడంతో ఇష్యూ పెద్దది అయింది. సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయింది. అధికార పార్టీపై అపోజిషన్ దాడి మరింత పెరిగింది. ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.
దాంతో కొండా సురేఖ వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కొండా ఇష్యూలో అసలేం జరిగిందని ఢిల్లీ పెద్దలు పీసీసీని నివేదిక కోరినట్లు చెబుతున్నారు. రాజకీయాలకు సంబంధం లేని సినిమావాళ్లను వివాదంలోకి లాగడంపై టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు వ్యతిరేకత వ్యక్తమవడంతో ఏఐసీసీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీసీసీ నుంచి పూర్తి వివరాలు అందగానే కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాస్త ఆలస్యంగా తేరుకుని..
కొండా సురేఖ కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీస్తాయని ఊహించని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా తేరుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖతో ప్రకటన ఇప్పించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తమ కుటుంబంపై కొండా చేసిన ఆరోపణల విషయాన్ని అక్కినేని అమల ఎక్స్ ద్వారా ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీకి ట్యాగ్ చేశారు. అంతే కాకుండా ఓ కేంద్ర మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కొండా సురేఖ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పెద్దలు అసలేం జరిగిందో రిపోర్ట్ పంపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబంపై కామెంట్ చేశారని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని పీసీసీ నేతలు కొండా సురేఖను వెనకేసుకొచ్చేలా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఓ కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పీసీసీ నివేదికతో ఏ మాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని అమలతో ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్‌లో మాట్లాడి జరిగిన విషయంపై ఆరా తీసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే భావన?
కొండా సురేఖ రేపిన చిచ్చుతో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే భావనకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదివారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న నేపధ్యంలో కొండా సురేఖ ఇష్యూపై మాట్లాడి అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని..ఆమెను బర్తరఫ్ చేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్‌లో రాహుల్ గాంధీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కచ్చితంగా కొండా సురేఖ మీద అధిష్టానం చర్యలు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాజీనామా డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో..రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఏదో ఒక బిగ్ స్టేట్‌మెంట్ రాబోతుందన్న ప్రచారం జరుగుతోంది.
హిందుత్వ ఎజెండాతో పవన్ దూకుడు.. ఆయన డిక్లరేషన్ కూటమికి ప్లస్సా? మైనస్సా?