Manuguru
Manuguru : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకొని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆవరణంలో ప్లెక్సీలు చింపేశారు. ఆ తరువాత ఫర్నీచర్ కు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. మా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Telangana : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. నలుగురు మృతి.. తప్పించుకున్న పెద్ద కుమార్తె..
గతంలో ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండేది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు విజయం సాధించారు. కొద్దికాలం తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాడు. కాంగ్రెస్ కార్యాలయంను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తలు రేగాకాంతారావు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన రేగా కాంతారావు ఓడిపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ కార్యాలయం వివాదం తెరమీదకు వచ్చింది. దీంతో ఆదివారం ఉదయం కార్యాలయం వద్దకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నీచర్ ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.