traffic diversions
Hyderabad : హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా.. మలక్ పేట్ ఫైర్ స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయనున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ వరకు ఒకవైపు రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ హాస్పి టల్ వరకు భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచు కోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
♦ భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, నల్గొండ ఎక్స్ రోడ్ నుండి వచ్చే వాహనాలు సైదాబాద్ వై జంక్షన్ వద్ద ఎడమకు తిరిగి.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ – సరస్వతి నగర్ కమాన్ – సంకేశ్వర్ బజార్ – సింగరేణి కాలనీ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ -చంపాపేట్ మెయిన్ రోడ్ మీదుగా ఐ.ఎస్ సదన్ చేరుకోవాలి.
♦ చంచల్‌గూడ నుంచి ఐఎస్ సదన్ వైపు వెళ్లే వారు సైదాబాద్ వైజంక్షన్ వద్ద నుంచి – 105 బస్ స్టాప్ వద్ద కుడి వైపు తిరిగి రామాలయం కమాన్ – లక్ష్మీనగర్- బిస్కట్ ఫ్యాక్టరీ -దోబీ ఘాట్ జంక్షన్ మీదుగా ఐఎస్ సదన్ మెయిన్ రోడ్డుకు చేరుకోవచ్చు.
♦ చంపాపేట్ వైపు వెళ్లే చిన్న వాహనాలు, చంచల్‌గూడ నుంచి వచ్చేవారు.. సైదాబాద్ వైజంక్ష న్ – 105 బస్ స్టాప్ వద్ద కుడి మలుపు తిరిగి రామాలయం కమాన్ వినయ్ నగర్- భారత్ గార్డెన్ మీదుగా చంపాపేట్ మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది.
♦ చాదర్ ఘాట్ నుంచి చంపాపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నల్గొండ ఎక్స్ రోడ్ – మూసారాంబాగ్ -గడ్డి అన్నారం యుటర్న్ -శివగంగా థియేటర్ – హనీఫియా మసీదు (సరూర్‌నగర్ చెరువు) -సింగరేణి కాలనీ – చంపాపేట్ మెయిన్ రోడ్‌లో వెళ్లాలి.
♦ భారీ వాహనాలు, ఎంజీబీఎస్/చాదర్ ఘాట్ నుండి వచ్చే జిల్లా బస్సులు నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద డైవర్ట్ అవుతాయి. ఇవి మూసా రాంబాగ్, దిల్సుఖ్నగర్, కోఠాపేట్, ఎల్బీ నగర్ చౌరస్తా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.