Koneru Konappa Vs Rs Praveen: సై అంటే సై.. కోనప్ప వర్సెస్ ఆర్ఎస్‌పీ.. కారు పార్టీలో కాకరేపుతున్న సిర్పూర్ రాజకీయం
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు మరోసారి కోనప్ప, ప్రవీణ్ కుమార్ వర్గ పోరుకు తెరలేపాయన్న టాక్ వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కోనప్ప, ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు.
Koneru Konappa Vs Rs Praveen Representative Image (Image Credit To Original Source)
- వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారంటూ కోనప్ప ప్రచారం
- సిర్పూర్ నుంచి పోటీ చేసేది తానేనంటున్న ఆర్ఎస్ ప్రవీణ్
- గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిన వ్యవహారం
Koneru Konappa Vs Rs Praveen: చంటిగాడు లోకల్ అంటారొకరు. ఇది నా ఇలాకా అంటారు మరొకరు. నా సీటు ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఒకరు.. ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశా..మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని మరొకరు. అటు కోనప్ప, ఇటు ఆర్ఎస్పీ..ఎవరూ తగ్గకపోవడంతో..సిర్పూర్ రాజకీయం కారు పార్టీలో కాక రేపుతోందట. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు పీక్ లెవల్‌కు చేరడంతో గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టికెట్ల లొల్లి మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు సీటు ఆశిస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది. సిర్పూర్ కాగజ్ నగర్ రాజకీయం అయితే బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గపోరుపై గులాబీ బాస్ కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. పంచాయతీ ఎన్నికల తర్వాత కోనేరు కోనప్ప, ఆర్ఎస్పీ మధ్య వర్గ విభేదాలు నెక్స్ట్ లెవల్‌కు చేరాయన్న టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎక్కువ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు గెలిచిన నియోజకవర్గాల్లో సిర్పూర్ కాజగ్ నగర్ ఒకటిగా చెప్పాలి. ఇక్కడ గులాబీ పార్టీ ఎమ్మెల్యే లేరు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటా పోటీగా పనిచేసి మెజార్టీ సర్పంచులను గెలిపించుకున్నారు. ఇది పార్టీకి మంచే చేసినా వీరిద్దరి రాజకీయం ఆందోళన కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది.
అతడి వల్లే ఓడిపోయాయని సీరియస్..
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రత్యర్థులు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కోనప్ప పోటీ చేయగా, బీఎస్పీ నుంచి ఆర్‌ఎస్ పోటీ చేశారు. అయితే చివరికి ఇద్దరూ ఓడిపోయి మధ్యలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడంతో ఓట్లు చీలి తాను ఓడిపోయానని కోనప్ప గుర్రుగా ఉన్నారట. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడంతో కోనప్ప అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కోనప్ప. ఆయన చేరికను బహిరంగంగా వ్యతిరేకించకపోయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్‌లో ఓవైపు కోనేరు కోనప్ప, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ బీఆర్ఎస్ తరపున పనిచేస్తూ వస్తున్నారు.
మరోసారి వర్గ పోరు..
ఈ క్రమంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు మరోసారి కోనప్ప, ప్రవీణ్ కుమార్ వర్గ పోరుకు తెరలేపాయన్న టాక్ వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కోనప్ప, ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు. కోనప్ప వర్గం 54, ప్రవీణ్ కుమార్ వర్గం 20 గ్రామ పంచాయతీలను గెలుచుకుందట. అధిక పంచాయతీలను గెలిపించుకున్న కోనప్ప వర్గం హుషారుగా ఉండగా, ఆర్ఎస్పీతో పాటు ఆయన అనుచరులు మాత్రం కాస్త చతికిలపడిపోయారట. ఈ క్రమంలోనే పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదని మాజీ ఎమ్మెల్యే కోనప్ప మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారట ఆర్ఎస్పీ.
టికెట్లు ఇచ్చే అధికారం తమకే ఇవ్వాలని డిమాండ్..
పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలకే ఇంత తతంగం జరిగితే..ఇక పార్టీ గుర్తులతో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటిసీ, మున్సిపల్ ఎన్నికల్లో వీరి రాజకీయం ఎలా ఉంటుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ అధిష్టానంలో కనిపిస్తోందట. ఎంపీటీసీ, జడ్పీటిసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఫారాలు ఇచ్చే అధికారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిపించిన కోనప్పకే పార్టీలో పరపతి ఉంటుందని, టికెట్లు ఇచ్చే అధికారం కోనప్పకే ఇవ్వాలంటూ ఆయన వర్గం కోరుతోందట.
గులాబీ పార్టీ హైకమాండ్‌కు తలనొప్పి..!
గెలిపించుకున్న సర్పంచ్‌లతో కలిసి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాలని కోనేరు కోనప్ప భావిస్తుండగా, అధిష్టానం తగ్గర తాడో పేడో తేల్చుకోవాలని ఆర్ఎస్పీ అనుకుంటున్నారట. ఇదంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లీడర్లు దూకుడు పెంచారన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని కోనేరు కోనప్ప చెప్పుకుంటుండగా, కచ్చితంగా తాను సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శపథం చేస్తున్నారట. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్ రాజకీయం గులాబీ పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో సమన్వయం చేసుకోవాలని కోనేరు కోనప్పకు గతంలో అధినేత కేసీఆర్ సూచించారని గుర్తు చేస్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలు కాస్త మళ్లీ వీళ్లిద్దరి మధ్య రాజకీయ విభేదాలను రాజేశాయని, మరి కోనప్ప, ఆర్‌ఎస్పీ విషయంలో కారు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..
