సామాజిక మాధ్యమాలలో ఫేక్ వార్తలను ప్రచారం చేసేవాళ్లు ఇటీవలికాలంలో ఎక్కువ అయిపోయారు. అందులోనూ కొందరిని టార్గెట్‌గా చేసుకుని, దురుద్ధేశాలతో లేనివాటిని ఆపాదిస్తూ.. సంస్థలకు, వ్యక్తులకు చెడ్డపేరు తేవాలని భావించే వ్యక్తులు దిగజారిపోయి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 10టీవీ పేరు మీద తిరుగుతున్న ఫోటో తప్పు అయినా సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. అబద్ధాలను అందంగా చెప్పగలిగితే నమ్మేస్తారు అనుకుని, దిగజారుడు పద్ధతులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు.
10టీవీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విలువలతో కూడిన వార్తలను అందిస్తున్న 10టీవీకి దురుద్ధేశాన్ని ఆపాదిస్తూ.. తప్పుడు సమాచారాన్ని వేగంగా 10టీవీ లోగోను ఉపయోగించి ప్రచారం చేసుకుంటున్నారు. తప్పుడు వార్తలతో, మార్ఫింగ్ ఫోటోలతో 10టీవీ క్రెడిబులిటీని దెబ్బ తీయాలనే ఉద్ధేశ్యంతో వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ పేజీల్లో, ట్విట్టర్‌లో ఈ ఫోటోను పెట్టి ప్రచారం చేస్తున్నారు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అల్వాల్ ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరారీ అయినట్లుగా 10టీవీ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వార్త నూటికి నూరు శాతం అవాస్తవం అని ప్రజలు గమనించాలి. అలాంటి బ్రేకింగ్ న్యూస్ ఏది కూడా 10టీవీ ప్రసారం చెయ్యలేదు. దీనిపైన 10టీవీ కచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని తెలియజేస్తున్నాము.
మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం. కానీ.. సోషల్ మీడియాలో పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమం ఏమీ లేకపోవడంతో కాస్త ఫొటోషాప్ తెలిసి, నాలుగు అక్షరాలు రాసే జ్ఞానం ఉంటే చాలు. కామన్‌సెన్స్ లేకపోయినా అనైతిక ప్రచారాలు, వ్యక్తిగత సోషల్ దాడులు చేసుకుంటూ బతికేస్తున్నారు కొందరు. అటువంటివాటిని ప్రతిఒక్కరూ ఖండించాలని 10Tv కోరుకుంటుంది.