తెలంగాణలో కరోనా : కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

  • Publish Date - March 21, 2020 / 12:58 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ … కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్య సిబ్బంది తమ పని తాము చేయడానికి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించాలని తొలుత భావించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్‌ సోకినట్టు తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యలను అధికారులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచలను చేస్తూ వచ్చారు.

సీఎం సూచనలతో అధికారులు కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు. కరీంనగర్‌లో ఇంటింటికి వైద్య బృందాలను పంపి పరీక్షలు చేయించారు. కలెక్టర్ కార్యాలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో శానిటైజ్‌ చేయించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు బస చేసిన ప్రార్థనా మందిరాన్ని రసాయనాలతో శుభ్రం చేయించారు. దీంతో ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప.. స్థానికులెవరికీ వ్యాధి సోకలేదు. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించాలని కేసీఆర్‌ భావించారు. శుక్రవారమే ఆయన కరీంనగర్‌లో పర్యటించాలనుకున్నారు. అయితే ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌  ఉండడంతో శనివారం పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పుడు ఇది కూడా వాయిదా వేసుకున్నారు. 

Read More : కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు