Corona Tension To Staff Of The Greater Hyderabad Municipal Corporation Office
corona Tension to staff of the GHMC office : హైదరాబాద్‌లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. దీంతో అన్ని కార్యాలయాలు.. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. నిత్యం రద్దీగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సిబ్బందిని మాత్రం ఓ టెన్షన్ వెంటాడుతోంది.. మరి ఏంటా టెన్షన్? బల్దియాను కరోనా టెన్షన్ వెంటాడుతుతోంది. కొన్ని వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. సిబ్బందికి కోవిడ్ భయం వెంటాడుతోంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో.. ఎలాంటి కరోనా రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో.. సిబ్బంది డైలమాలో పడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలనూ కనీసం పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.
బల్దియాలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోనల్ కార్యాలయాలు.. 30 సర్కిల్ కార్యాలయాలు.. వార్డు ఆఫీస్‌లున్నాయి. ఇందులో వేల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తుంటారు. పెద్ద సంఖ్యలో విజిటర్స్ బల్దియా కార్యాలయాలకు వస్తుంటారు. ఎంట్రన్స్.. అధికారుల కార్యాలయాల వద్ద శాటిటైజర్లు ఏర్పాటు చేయడం.. భౌతికదూరం పాటించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో మాత్రం అలాంటి పరిస్థితితులు ఎక్కడా కనించడం లేదు. తాజాగా బల్దియా ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడటం హాట్ టాపిక్ అయింది. బల్దియా హెడ్ ఆఫీస్‌లోని ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లు, ఒక డిప్యూటీ ఇంజనీర్ కరోనా బారిన పడ్డారు.
ఇటీవల జీహెచ్‌ఎంసీలో పనిచేసే జోనల్ కమిషనర్లు.. ఇతర అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్ ప్రారంభంలోనూ ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ఉన్న బల్దియా అధికారులు సిబ్బందికి కరోనా అటాక్ అయ్యింది. అయితే అప్పుడు అధికారులు, సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్, ఫేష్ షీల్డ్‌లను అందించింది జీహెచ్‌ఎంసీ. కార్యాలయాలకు వచ్చే వారు తమ చేతులను శానిటైజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అధికారుల చాంబర్ల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయడం.. అక్కడికి వచ్చిన సందర్శకులు కూర్చోవడానికి సోషల్ డిస్టెన్స్ పద్దతిలో సిట్టింగ్ ఏర్పాటు చేయడం వంటి.. ఏర్పాట్లు చేశారు అధికారులు.
అయితే.. ప్రస్తుతం అవన్నీ కనుమరుగయ్యాయి. ఏర్పాటు చేసిన శానిటైజర్ మిషన్లు పనిచేయడం లేదు. కరోనా కట్టడికి కనీస చర్యలు తీసుకోకపోవడం.. తీసుకున్నా అవి అంతంత మాత్రంగానే మారడంతో.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కోవిడ్ భయంతో బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడాలి ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తారో లేదో మరి…!