తెలంగాణాలో కరోనా 127 కేసులు : ఢిల్లీకి వెళ్లి ఎవరెవరిని కలిశారు..ఫుల్ టెన్షన్

  • Publish Date - April 2, 2020 / 01:43 AM IST

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. కరోనా బాధితుల సంఖ్య 127 కి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. తాజా బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులేనని వైద్య వర్గాలు తెలిపాయి.

వైరస్‌ సోకిన 97 మందిలో.. 14 మంది కోలుకోగా.. ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 77 మంది చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరూ గాంధీ ఆసుపత్రిలో పరీక్షల చేయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలో మతపరమైన సదస్సుకు రాష్ట్రం నుంచి 2200 మంది వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇప్పటివరకూ 35 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

మిగిలినవారిలో ఎందరిలో కరోనా లక్షణాలున్నాయి, వీరు ఎంత మందిని కలిశారనేది ప్రాధాన్యాంశాలుగా మారాయి. కరోనా సోకిన వారిలో నాగర్‌ కర్నూలులో ఓ బట్టల వ్యాపారి, ఓ మటన్‌ వ్యాపారి ఉన్నారు. వీరు వందల మందిని కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నట్టుండి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయా? అనే కోణంలోనూ వైద్య ఆరోగ్య శాఖ దృష్టిసారించి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటివరకూ తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న కేసులు 400 వరకూ నమోదుకాగా, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో 120 కేసులొచ్చినట్లు గుర్తించారు.

అప్రమత్తమైన ఆరోగ్యశాఖ.. ఆయా రోగుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. నీలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలో కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో.. ఆ బాలికకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు 20 మందిని అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు.