Telangana Congress : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్

చిన్న చిన్న విషయాలకే భగ్గుమనే కాంగ్రెస్‌ పార్టీని ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చిచ్చు ఎన్నికల ముందు ఏం చేస్తుందోననే ఆందోళన పార్టీలో కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Telangana Congress : కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. మమ్మల్ని అడగకుండానే కార్పొరేషన్లు భర్తీ చేశారంటూ పార్టీ ముఖ్యనేతలు గుర్రుగా ఉన్నారు. తాము సూచించిన వారికి పదవులు ఇవ్వలేదంటూ గరం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నామినేటెడ్‌ పోస్టుల నియామకం పార్టీలో అగ్గి రాజేసింది. నేతల మధ్య గ్యాప్‌ పెంచింది. అసలు కార్పొరేషన్‌ పదవుల భర్తీ నేతల మధ్య చిచ్చు ఎందుకు పెట్టింది?

చిచ్చు పెట్టిన పోస్టుల భర్తీ..
లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లలో మెజార్టీ స్థానాల గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టింది. పార్టీ అధికారంలోకి రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రాని నేతలకు నామినేటెడ్‌ పోస్టులు కట్టబెట్టింది. అందులో భాగంగానే మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రేవంత్‌ ప్రభుత్వం. అయితే.. అదే ఇప్పుడు పార్టీలో, మంత్రివర్గంలో చిచ్చు పెట్టింది. తాము సూచించిన నేతలకు పదవులు దక్కలేదని కొందరు.. తమను సంప్రదించకుండానే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేశారని మరికొందరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అలిగారు.

సీఎం రేవంత్ పై పొన్నం సీరియస్..
కరీంనగర్‌ జిల్లా నుంచి తాను సూచించిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌.. రేవంత్‌ మీద గుర్రుగా ఉన్నారు. కేవలం శ్రీధర్‌ బాబు మనుషులకే నామినేటెడ్‌ పోస్టులు దక్కాయని పొన్నం అలకబూనారు. కరీంనగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంగా ఉన్నారు. కరీంనగర్‌ లోక్‌సభ ఇంచార్జిగా ఉన్న తనను సంప్రదించకుండా పదవులు ఎలా కట్టబెడతారని కోపంగా ఉన్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ సరిగ్గా జరగలేదని పార్టీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీకి ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశారయన. సీఎం రేవంత్‌ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి ఫోస్‌ చేసి నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కేవలం ఒక నాయకుడి వర్గానికే పదవులు ఇవ్వడం సరైంది కాదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకు తెలియకుండానే ఎలా భర్తీ చేస్తారని ఆగ్రహం
మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషంలో అసంతృప్తిగా ఉన్నారు. తన శాఖ పరిధిలో తనకు తెలియకుండానే నామినేటెడ్‌ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ శాఖలోని ఐడీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వర్‌ రావు నియామకం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సీనియర్‌ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ సైతం ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో తనను సంప్రదించలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు.

హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో భర్తీ చేసిన నామినెటెడ్‌ పోస్టుల విషయంలో సైతం అన్యాయం జరిగిందంటూ మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు రాలేదని వారు అంటున్నారు.

ఎన్నికల ముందు ఏం జరుగుతుందో అనే ఆందోళన..
అసంతృప్త నేతలను బుజ్జగించి లోక్‌సభ ఎన్నికల సమయంలో వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి.. పార్టీ పనుల్లో బిజీగా పెడుదామనుకున్న ప్లాన్‌ కాస్తా రివర్స్‌ అయింది. ఇష్టమొచ్చినట్టు నామినేటెడ్‌ పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ పార్టీ సీనియర్‌ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే భగ్గుమనే కాంగ్రెస్‌ పార్టీని ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చిచ్చు ఎన్నికల ముందు ఏం చేస్తుందోననే ఆందోళన పార్టీలో కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read : ఆఫర్స్‌తో బలమైన నేతలకు గాలం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం

 

ట్రెండింగ్ వార్తలు