Covid
Corona Second Wave: దేశవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు అని హెచ్చరిస్తున్న వేళ, తెలంగాణ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే విషయం చెప్పింది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లేనని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం పోస్ట్ కోవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని, అందుకోసం అవసరమైన చర్యలు అధికారులు చేపట్టినట్లు చెప్పారు అధికారులు.
డాక్టర్ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం.. దోమలు, లార్వా వృద్ధి నివారణా చర్యలను, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు సూచనలు చేశారు. రాష్ట్రంలోని పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్లను ఏర్పాటు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 డెంగ్యూ కేసులు ఇప్పటివరకు నమోదవగా.. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సీజనల్ వ్యాధుల పరిస్థితిని వెల్లడించిన శ్రీనివాస్.. హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా ఉన్నాయని, 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌లు పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఇక రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 65లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులకు కారణం శరవేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చెయ్యడమే అని కూడా వివరించారు.