Covid-19 Hussain Sagar : హుస్సేన్‌ సాగర్‌లో కరోనా జాడలు

Covid 19 Virus Samples Found In Hussain Sagar

Covid-19 Virus Samples Hussain Sagar  : హైదరాబాద్‌ వాసులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు శాస్త్రవేత్తలు. మహానగరం నడిబొడ్డున ఉన్న హుస్సేస్ సాగర్‌ నీటిలో కరోనా వైరస్ ఉందంటున్నారు పరిశోధకులు. నీటి వనరుల నమూనాల్లోని కరోనా వైరల్‌ లోడ్‌ ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. వైరస్‌ సంక్రమణ వ్యాప్తిని ముందే తెలుసుకునేందుకు మురుగునీరు, చెరువుల్లో నీటి నమూనాలను తరచూ సేకరించి విశ్లేషిస్తున్న IICT, CCMB శాస్త్రవేత్తలు ఇప్పుడీ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు.

ఫస్ట్ వేవ్‌లో మురుగు నీటిలో వైరస్ నమూనాలు బహిర్గతం చేసిన శాస్త్రవేత్తలు.. నగరంలోని పలు చెరువుల్లోనూ వైరస్ నమూనాలున్నట్లు తేల్చారు. నాచారంలోని పెద్ద చెరువు కేంద్రంగా ఏడు నెలలుగా నీటి నమూనాలను మొదట్లో నెలవారీగా విశ్లేషించారు.. కానీ ఇప్పుడు వారంరోజులకోసారి సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. నగరంలోని హుస్సేన్‌సాగర్‌, ప్రగతినగర్‌లోని తుర్కచెరువు, నాచారం పెద్ద చెరువు, శివారులో ఘట్‌కేసర్‌లోని ఏదులాబాదు చెరువు, పోతరాజు చెరువుల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించారు.

నాచారం చెరువు నుంచి కోవిడ్‌ ఫస్ట్ వేవ్ చివరిలో సెకండ్ వేవ్ ఆరంభంలో చెరువు నీటి నమూనాల్లోని వైరల్‌ లోడ్‌లో స్పష్టమైన తేడాను గుర్తించినట్లు చెప్పారు పరిశోధకులు. ఫస్ట్ వేవ్ వ్యాప్తి ఎక్కువ మోతాదులో ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు.. డిసెంబర్‌ నుంచి జనవరి వరకు తగ్గుతూ వచ్చిందంటున్నారు. ఫిబ్రవరిలో చెరువుల్లోని నీటి నమూనాల్లో వైరల్‌ లోడ్‌ పెరగడం గుర్తించామని.. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మరింతగా పెరిగిందని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి నీటిలో వైరల్‌ లోడ్‌ పెరగడం గమనించామంటున్నారు శాస్త్రవేత్తలు.