CP Ranganath: అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్.. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదు: సీపీ రంగనాథ్

కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.

CP Ranganath

CP Ranganath: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్టు విషయం, తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ (10th class question papers Leak) పై వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) వివరాలు తెలిపారు. వరంగల్ లో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. కమలాపూర్ నుంచే ప్రశ్నపత్రాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? అని అన్నారు.

అన్ని పరీక్ష పత్రాలూ లీక్ అవుతున్నాయన్న ప్రచారాన్ని సమాజంలో వ్యాపింపజేయాలని కుట్ర పన్నారని తెలుస్తోందని సీపీ రంగనాథ్ వివరించారు. పరీక్షల ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా కుట్ర పన్నారని చెప్పారు. ముందస్తుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. సెక్షన్ 41 ప్రకారం వారెంట్ లేకుండానే నోటీసులు ఇవ్వచ్చని అన్నారు.

ఎంపీ బండి సంజయ్ అరెస్టు విషయంపై లోక్ సభ స్పీకర్ కు సమాచారం అందించామని తెలిపారు. ప్రతి అరెస్టుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఫస్ట్ నేరం చేసిన వాడే ఏ1గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదని తెలిపారు. ఫోన్ ఎందుకు దాచిపెడుతున్నారు? అని అన్నారు. ఇప్పటికే డిలీట్ చేసిన డేటాను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదుచేశామని తెలిపారు.

మహేశ్ ను విచారించినప్పుడు కీలక సమాచారం బయటపడిందని అన్నారు. బండి సంజయ్ ఒక్కరినే కేసులో ఇరికించాల్సిన అవసరం లేదని తెలిపారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రశాంత్ న.మో టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. బండి సంజయ్ కు నిందితుడు ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని ఫార్వర్డ్ చేశాడు. పేపర్ లీక్ పక్కా కుట్ర ప్రకారమే జరుగుతోందని చెప్పారు. అరెస్టులు అన్నీ సీఆర్పీసీ నోటీసుల ప్రకారమే చేశామని తెలిపారు.

ఈటల రాజేందర్ కు కూడా ప్రశ్నపత్రం
పదో తరగతి ప్రశ్నపత్రాల లికేజ్ కేసులో A1గా బండి సంజయ్, A2గా బొరం ప్రశాంత్, A3గా మహేశ్, A4గా శివ గణేశ్, A5 ఓ మైనర్ బాలుడు ఉన్నాడని చెప్పారు. కమలాపూర్ బాలుర పాఠశాల నుండి బయటకు వచ్చిందనివివరించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారని తెలిపారు. బురం ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, అతడు చాలా మందికి ప్రశ్నపత్రం వాట్సప్ లో పంపించాడని వివరించారు.

గుండెబోయిన్ మహేశ్ కూడా చాలామందికి పంపించాడని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ప్రశ్న పత్రం పంపించారని వివరించారు. మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశారని తెలిపారు. ప్రశాంత్ చాటింగ్ లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారని చెప్పారు. ముందు రోజు వాట్సాప్ కాల్ లో బండి సంజయ్ తో ప్రశాంత్ మాట్లాడాడని తెలిపారు.

బండి సంజయ్ ఫోన్ లేదని అంటున్నారని, ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుందని చెప్పారు. కాల్ డేటా రావాలిసి ఉందని, వాట్సాప్ చాటింగ్ కూడా ఇంకా రావాలని అన్నారు. కమలాపూర్ లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరా తీశామని చెప్పారు. ముందుగా మాట్లాడుకుని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుండి లీక్ చేస్తున్నారని తెలిపారు. పక్కా లీగల్ ప్రాసెస్ చేస్తున్నామని, రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదని చెప్పారు. వరంగల్ లో ఎక్కువ అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని తెలిపారు. పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్ అని స్పష్టం చేశారు.

Bandi Sanjay Arrest: పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్.. Live Updates