Bandi Sanjay Arrest: బండి సంజయ్‪కు 2 వారాల రిమాండ్.. జైలుకి తరలింపు

బండి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్తున్న వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, చెప్పులు విసిరారు.

Bandi Sanjay Arrest: బండి సంజయ్‪కు 2 వారాల రిమాండ్.. జైలుకి తరలింపు

Bandi Sanjay

Bandi Sanjay Arrest: తెలంగాణలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదు చేశారు. బండి సంజయ్ కు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లోనే ఉండనున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 05 Apr 2023 08:12 PM (IST)

    బండి సంజయ్ కు కోర్టు రెండు వారాల రిమాండ్

    బండి సంజయ్ కు హనుమకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లోనే ఉండనున్నారు. కోర్టు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు.

  • 05 Apr 2023 07:42 PM (IST)

    చొక్కావిప్పి లాయర్లకు చూపించిన బండి సంజయ్

    Bandi Sanjay

    Bandi Sanjay

    పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బీజేపీ లీగర్ సెల్ లోని లాయర్లకు బండి సంజయ్ చెప్పారు. తనకు గాయాలు అయ్యాయంటూ చొక్కావిప్పి లాయర్లకు చూపించారు.

  • 05 Apr 2023 06:47 PM (IST)

    A5గా ఓ మైనర్ బాలుడు

    పదో తరగతి ప్రశ్నపత్రాల లికేజ్ కేసులో A1గా బండి సంజయ్, A2గా బొరం ప్రశాంత్, A3గా మహేశ్, A4గా శివ గణేశ్, A5గా ఓ మైనర్ బాలుడు ఉన్నారని సీపీ రంగనాథ్ చెప్పారు. కమలాపూర్ బాలుర పాఠశాల నుండి బయటకు వచ్చిందని వివరించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారని తెలిపారు. మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశారని తెలిపారు.

  • 05 Apr 2023 06:31 PM (IST)

    ఈటల రాజేందర్‌కు కూడా ప్రశ్నపత్రం: సీపీ

    నిందితుడు బురం ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, అతడు చాలా మందికి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ లో పంపించాడని సీపీ రంగనాథ్ వివరించారు. గుండెబోయిన్ మహేశ్ కూడా చాలామందికి పంపించాడని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ప్రశ్న పత్రం పంపించారని వివరించారు.

  • 05 Apr 2023 05:59 PM (IST)

    అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్: సీపీ రంగనాథ్

    ఎంపీ బండి సంజయ్ అరెస్టు విషయం, తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ పై సీపీ రంగనాథ్ వివరాలు తెలిపారు. కమలాపూర్ నుంచే ప్రశ్నపత్రాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? అని అన్నారు. అన్ని పరీక్ష పత్రాలూ లీక్ అవుతున్నాయన్న ప్రచారాన్ని సమాజంలో వ్యాపింపజేయాలని కుట్ర పన్నారని తెలుస్తోందని వివరించారు. పరీక్షల ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా కుట్ర పన్నారని చెప్పారు.

    ముందస్తుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోందని సీపీ అన్నారు. నిందితుడు మహేశ్ ను విచారించినప్పుడు కీలక సమాచారం బయటపడిందని తెలిపారు. బండి సంజయ్ కు మరో నిందితుడు ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని ఫార్వర్డ్ చేశాడని సీపీ రంగనాథ్ వివరించారు. విద్యార్థుల్లో గందరగోళం నెలకొల్పేందుకు కుట్ర జరిగినట్లు కేసు నమోదు చేశామని చెప్పారు.

  • 05 Apr 2023 05:50 PM (IST)

    లోక్ సభ స్పీకర్ కు సమాచారం అందించాం: సీపీ రంగనాథ్

    ఎంపీ బండి సంజయ్ అరెస్టు విషయంపై లోక్ సభ స్పీకర్ కు సమాచారం అందించామని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రతి అరెస్టుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సెక్షన్ 41 ప్రకారం వారెంట్ లేకుండానే నోటీసులు ఇవ్వచ్చని అన్నారు. అలాగే, ఫస్ట్ నేరం చేసిన వాడే ఏ1గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

  • 05 Apr 2023 05:21 PM (IST)

    వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన టీఆర్ఎస్ కార్యకర్తలు

    బండి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్తున్న వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో కాసేపు రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది.

  • 05 Apr 2023 05:20 PM (IST)

    పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్

    జనగాం జిల్లా పాలకుర్తిలో బండి సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనపై ఐటీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు రిమాండు ద్వారా కీలక విషయాలు తెలిశాయి. లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ1గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదుచేశారు.

  • 05 Apr 2023 01:27 PM (IST)

    హన్మకొండ కోర్టు దగ్గర హైటెన్షన్..

    బండి సంజయ్‌ను కొద్దిసేపట్లో పోలీసులు హన్మకొండ కోర్టు వద్దకు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హన్మకొండ కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెబుతున్నారు.

  • 05 Apr 2023 01:19 PM (IST)

    బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్

  • 05 Apr 2023 01:08 PM (IST)

    బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ హైకమాండ్ ఆరా..

    బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ కేంద్ర పెద్దలు ఆరాతీశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యనేతలతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం అమిత్ షా, జేపీ నడ్డాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరి భేటీలో బండి సంజయ్ అరెస్టు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

  • 05 Apr 2023 12:29 PM (IST)

    వాహనాలు మారుస్తూ సంజయ్ తరలింపు ..

    బండి సంజయ్‌ను హన్మకొండ తీసుకెళ్తున్న పోలీసులు. మార్గం మధ్యలో వాహనాలు మారుస్తూ సంజయ్‌ను పటిష్ట భద్రత మధ్య తరలిస్తున్నారు.

  • 05 Apr 2023 12:28 PM (IST)

    బండి సంజయ్ అరెస్ట్‌పై కుటుంబసభ్యులు సీరియస్

  • 05 Apr 2023 12:25 PM (IST)

    రఘునందన్, రాజాసింగ్, ఈటల అరెస్ట్..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్లను పోలీసులు అరెస్టు చేశారు.

  • 05 Apr 2023 12:23 PM (IST)

    బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఇందులో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.

  • 05 Apr 2023 12:17 PM (IST)

    పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..

    హైడ్రామా మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హన్మకొండకు తరలిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలీసుల ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాలకుర్తి నుంచి వర్ధన్నపేట మీదుగా హన్మకొండకు సంజయ్‌ను పోలీసులు తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో హన్మకొండలోని జడ్జి నివాసంలో బండి సంజయ్‌ను హాజరుపర్చే అవకాశం ఉంది.

  • 05 Apr 2023 12:04 PM (IST)

    బండి సంజయ్‌ అరెస్టును ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • 05 Apr 2023 12:01 PM (IST)

    అర్థరాత్రి అసలేం జరిగింది ..

    అర్థరాత్రి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అర్థరాత్రి సమయంలో ఏ సమయంలో ఏం జరిగిందో చూద్దాం.

    -  మంగళవారం రాత్రి 11.35 హైదరాబాద్ నుంచి కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని తన నివాసానికి బండి సంజయ్ చేరుకున్నారు.

    -  12.15AM: బండి సంజయ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.

    -  12.20 AM: పోలీసుల‌తో సంజయ్ వాగ్వాదం

    -  12.40 AM: బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు పోలీసుల యత్నం

    -  12.59 AM: వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.

    -  1.05 AM: తోపులాటలో గాయపడిన బండి సంజయ్.

    -  1.10 AM: బండి సంజయ్‌ని తరలిస్తుండగా మొరయించిన పోలీసుల వాహనం

    -  1.20AM: గజ్వేల్ మీదుగా బొమ్మల రామరాం పోలీస్ స్టేషన్‌కి తరలింపు.

    -  2.27AM: కరీంనగర్ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేసిన బీజేపీ శ్రేణులు

  • 05 Apr 2023 11:51 AM (IST)

    సంజయ్‌ను అరెస్టును తీవ్రంగా ఖండించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

    బండిసంజయ్ అరెస్టును బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి అకారణంగా, అక్రమంగా సంజయ్‌ను అరెస్టు చేసి  గొంతునొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. సంజయ్‌ను అరెస్టు చేసి రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదని లక్ష్మణ్ హెచ్చరించారు. 30లక్షల మంది విద్యార్థుల బతుకులు లీకేజీ కారణంగా ఆగమయ్యాయని, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే సంజయ్‌ను అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని లక్ష్మణ్ అన్నారు.

  • 05 Apr 2023 11:44 AM (IST)

    జైలుకు పంపినా సంజయ్ భయపడడు.. ఎమ్మెల్యే రాజా‌సింగ్

    బండి సంజయ్ అరెస్టును బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.
    ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్టు చేయాలంటే ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో ముందు అరెస్టు నోటీసులు ఇవ్వాలి. కానీ నేరుగా ఇంట్లోకి వెళ్లి సంజయ్ ను అరెస్టు చేశారని అన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల జీవితాన్ని ఆగం చేస్తుందని విమర్శించారు. పేపర్ లీకేజీకి సంబంధించి విచారణ చేయాలని, అలా కాకుండా సంజయ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే భయపడతాడని అనుకుంటున్నారా అని రాజా సింగ్ ప్రశ్నించారు. ప్రజలకోసం పోరాడుతున్న బండి సంజయ్‌ను గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించిందని, ఇప్పుడుకూడా మరోసారి జైలుకు పంపించినా మళ్లీ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటం సాగిస్తారని రాజా సింగ్ అన్నారు.

  • 05 Apr 2023 11:35 AM (IST)

    బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ ..

    బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బాధ్యత కలిగిన ఎంపీలనుసైతం అర్థరాత్రి అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టాలను కాలరాస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 05 Apr 2023 11:25 AM (IST)

    బీజేపీ లీగల్ టీంను అడ్డుకున్న పోలీసులు..

    బండి సంజయ్‌ను అరెస్టు చేసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న సంజయ్‌ను కలుసుకొనేందుకు బీజేపీ లీగల్ టీం వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

  • 05 Apr 2023 11:21 AM (IST)

    బండి సంజయ్ అరెస్టుపై జేపీ నడ్డా ఆరా..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ అరెస్టు పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు. రాష్ట్రంలోని బీజేపీ కీలక నేతలకు ఫోన్ చేసి సంజయ్ అరెస్ట్ వివరాలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్నట్లు సమాచారం.

  • 05 Apr 2023 11:17 AM (IST)

    బండి సంజయ్‌పై కుట్ర కేసు..

    వరంగల్‌లో టెన్త్ హిందీ పేపర్ వైరల్ అయిన కేసులో బండిసంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసును నమోదు చేశారు. బండి సంజయ్‌ను హన్మకొండ వైపు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 05 Apr 2023 11:15 AM (IST)

    హన్మకొండ వైపుకు బండి సంజయ్ తరలింపు ..

    బండి సంజయ్‌ను పోలీసులు బొమ్మల‌రామారం పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. హన్మకొండ వైపు సంజయ్‌ను పోలీసులు తీసుకెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో సంజయ్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.