Congress – CPI Alliance : కొలిక్కివచ్చిన చర్చలు.. కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి.

kunamneni sambasiva rao and revanth reddy

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియసైతం ప్రారంభంకావడంతో టికెట్ దక్కిన ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. మరికొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టింది. సీపీఐ, సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. కానీ, సీట్ల సర్దుబాటు విషయంలో వీరి మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కిరావడం లేదు. తాజాగా సీపీఐ, కాంగ్రెస్ మధ్య టికెట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకేచెప్పినట్లు తెలిసింది. మరోవైపు మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తో ముందుకెళ్లాలని ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఇరు పార్టీలు పొత్తు విషయంపై సాయంత్రంలోపే ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read : YS Sharmila: మొన్న టీడీపీ, నిన్న టీజేఎస్.. నేడు వైఎస్‌ఆర్‌టీపీ.. ఎందుకిలా?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, మునుగోడు అభ్యర్ధిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలపై సీపీఐ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ భేటీలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలిసింది. మరోవైపు మునుగోడులో తప్పనిసరిగా పోటీ చేయాలని నల్గొండ జిల్లా నేతలు పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఉండదన్న వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సీపీఐ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

Also Read : MIM Contest : ఎంఐఎం పోటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఈ భేటీలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని, ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని రేవంత్ స్పష్టం చేసినట్లు, పలు అంశాలపై ఈ భేటీలో చర్చల అనంతరం కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే, మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకున్నట్లు సమాచారం. సీపీఐకు కేటాయించిన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేసే అవకాశం ఉంది. ఈ పొత్తుల అంశంపై సాయంత్రం లోపు ఇరు పార్టీల నుంచి ప్రకటన వస్తుందని తెలుస్తోంది. మరోవైపు సీపీఎం ఇప్పటికే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. సీపీఎం అడిగిన స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవటంతో ఆ పార్టీ దాదాపు 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చింది.