D Raja Representative Image (Image Credit To Original Source)
D Raja: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మండిపడ్డారు సీపీఐ జాయతీ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ట్రంప్ మరో హిట్లర్ లా మారారని, అన్ని దేశాలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ని కూడా డిక్టేట్ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అమెరికన్ దగ్గర మోకరిల్లొద్దని కోరారు. ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో డి.రాజా మాట్లాడారు.
”సీపీఐ పార్టీ చరిత్రాత్మకమైనది. సీపీఐ వందేళ్ల ప్రస్థానం త్యాగాలతో కూడుకుంది. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర కలిగింది. స్వాతంత్ర్య ఉద్యమంలో సీపీఐ, కాంగ్రెస్ పోరాటం చేశాయి. ఆర్ఎస్ఎస్ వందేళ్లలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నది లేదు. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ స్వాతంత్ర్య సమరంలో లేవు. అసలు ఏ పోరాటం చేశారో చెప్పాలి. కమ్యూనిస్టులు ఇంటర్నేషనలిస్టులు” అని రాజా అన్నారు.
పాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ ని కమ్యూనిస్టులు వదిలి పెట్టరని హెచ్చరించారు. వెనెజువెలా, క్యూబా ట్రంప్ కి గుణపాఠం చెబుతాయన్నారు. ట్రంప్ భారత్ ని కూడా డిక్టేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. యునైటెడ్ నేషన్స్ అంటే గౌరవం లేదన్నారు. అమెరికన్ వద్ద మోకరిల్లొద్దని ప్రధాని మోదీని కోరారు. నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడితే.. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సీపీఐ పార్టీ వందేళ్ళు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదల కోసం సీపీఐ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని డి.రాజా స్పష్టం చేశారు.
”స్వాతంత్ర్య ఉద్యమంలో సీపీఐ పాలుపంచుకుంది. స్వాతంత్ర్య సాధన కోసం సీపీఐ శ్రేణులు పోరాటం చేశాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదు. అప్పటి బ్రిటీష్ పాలకులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపింది. పాలస్తీనాలో మారణహోమం జరుగుతోంది. పాలస్తీనాలో వేల మంది అమాయకులను ఊచకోత కోస్తున్నారు. ఇజ్రాయల్, అమెరికా కలిసి పాలస్తీనాలో దారుణాలు చేస్తున్నాయి. ట్రంప్ నియంతలా మారారు, అన్ని దేశాలను బెదిరిస్తున్నారు. ప్రధాని మోదీ అమెరికా ముందు తల వంచారు. దేశ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు” అని విమర్శలు గుప్పించారు డి.రాజా.
Also Read: బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. మళ్లీ వలస పోయే పరిస్థితి తెచ్చారు- సీఎ రేవంత్
ఇదే సభలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీలపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కమ్యూనిజం లేదు, కమ్యూనిస్టులు లేరు అని చంద్రబాబు అంటున్నారని.. ఒక్కసారి ఖమ్మంలో మీ కళ్లతో చూడండి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ప్రధాని మోదీ బానిసగా మారారని విమర్శించారు. చంద్రబాబు లేకపోతే మోదీ లేరని అన్నారు నారాయణ.