బాబోయ్.. ఉడిపి హోటల్ ఇడ్లీలో జెర్రి..! షాక్‌లో కస్టమర్…

హోటల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

Insect In Idli : జగిత్యాలలోని గణేశ్ భవన్ ఉడిపి హోటల్ లో ఇడ్లీలో జెర్రి కలకలం రేపింది. టిఫిన్ చేసేందుకు వెళ్లిన మహిళ ఇడ్లీ ఆర్డర్ చేసింది. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రి ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారామె. ఇదేమిటని హోటల్ యజమానిని నిలదీయడంతో జెర్రి కాదని హోటల్ నిర్వాహకులు బుకాయించారు. ఆ తర్వాత ఇడ్లీలను చెత్తలో పడేశారు. కస్టమర్లు వారిని అడ్డుకున్నారు. హోటల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇలాంటి ఇడ్లీలు చిన్న పిల్లలు తింటే వారి పరిస్థితి ఏంటని కస్టమర్ ప్రశ్నిస్తున్నారు. హోటల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

అది పురుగు కాదు పేపర్ అని హోటల్ నిర్వాహకుల బుకాయింపు..
”హోటల్ నుంచి ఇడ్లీ, వడ తెచ్చుకున్నాం. ఇడ్లీ తిందామని ఓపెన్ చేశాం. అందులో ఏదో ఉంది. అది జెర్రిలా ఉంది. అది చూసి మేమే షాక్ అయ్యాం. వెంటనే ఇడ్లీ పార్సిల్ తీసుకుని హోటల్ కు వచ్చాం. ఇదేంటని అడిగితే హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. దాన్ని ఇక్కడికి తీసుకొస్తే అది పురుగు కాదు.. పేపర్, దారం అంటున్నారు. మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి అది జెర్రి అని. అయినా వాళ్లు మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు. లైవ్ శాంపిల్ మా దగ్గర ఉంది. అయినా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అది పురుగు కాదు దారం అని వంట మాస్టర్ మాతో గొడవ పెట్టుకున్నాడు” అని బాధిత కస్టమర్ వాపోయారు.

బయటి ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్..!
ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. స్ట్రీట్ ఫుడ్ తినే ముందు ఆలోచన చేయాల్సిందే. హోటల్, రెస్టారెంట్లకు వెళ్లి తిందామన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత అస్సలు పాటించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహార పదార్ధాలు వండి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆహార పదార్దాల్లో పురుగులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బయటి ఫుడ్ తినాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ ఆహారంలో ఏమొస్తుందో తెలియడం లేదు. ఏది ఏమైనా బయటి ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని డాక్టర్లు అంటున్నారు.

 

Also Read : డీజేతో గుండెపోటు..! డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. అమలాపురంలో తీవ్ర విషాదం..