ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా IVF కేంద్రాలు: మంత్రి దామోదర రాజనర్సింహ

ఏర్పాటు చేయనున్న కేంద్రాలలో ఒకటి వరంగల్‌, రెండు నిజామాబాద్‌, మూడోది కొండాపూర్‌లో ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

damodar raja narasimha

ప్రభుత్వ రంగంలో కూడా ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొండాపూర్‌లోని శేరిలింగంపల్లిలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ‘కన్సీవా ఫెర్టిలిటీ’ని శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కేంద్రాలలో ఒకటి వరంగల్‌, రెండు నిజామాబాద్‌, మూడోది కొండాపూర్‌లో ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఫెర్టిలిటీ కేంద్రాల అవసరం చాలా ఉందని తెలిపారు. ‌

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పులే వంధ్యత్వానికి కారణంగా చెప్పవచ్చన్నారు. వంధ్యత్వ సమస్యను అధిగమించడానికి ఫెర్టిలిటీ కేంద్రాల అవసరం ఎంతో ఉందన్నారు. ఆధునాతన వైద్య పద్ధతులు గర్భధారణ అవకాశాలను పెంచుతాయన్నారు. అందువల్ల ఈ సమస్యతో దంపతులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా కన్సీవా ఫెర్టిలిటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్పూర్తి చెన్నమనేని మాట్లాడుతూ వంధ్యత్వానికి ఇప్పుడు చికిత్స కలదన్నారు. తల్లిదండ్రుల కలను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయాలన్నారు. పురుషులు, మహిళలు ఇద్దరికీ అధునాతన, పునరుత్పత్తి సంరక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Also Read: మహిళా దినోత్సవం.. మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి.. అంతేకాదు.. 

తల్లిదండ్రులుగా మారాలనుకునే జంటలకు శాస్త్రీయ, విశ్వసనీయ చికిత్స అందించనున్నామని చెప్పారు. ఇందులో ఐవీఎఫ్/ఐసీఎస్ఐ, క్రయోప్రిజర్వేషన్, జన్యు పరీక్షలు, వ్యక్తిగత పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

సంతానోత్పత్తి సంరక్షణ వ్యక్తిగతంగా అందుబాటులో ఉండాలని విశ్వసిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే, తల్లిదండ్రులుగా మారాలనుకునే ప్రతి ప్రయాణం ప్రత్యేకమైనదన్నారు. ప్రతి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పునరుత్పత్తి సంరక్షణ అందించడం, అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం మా ప్రత్యేకత అన్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య బృందం నేతృత్వంలో మా ఫెర్టిలిటీ రోగికి ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని అనుసరిస్తుందన్నారు. ఇది అత్యుత్తమ ప్రమాణాలతో నడవనుందన్నారు.

ఈ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది సంతానోత్పత్తి కోరుకునే జంటలకు అండగా నిలవనున్నారని చెప్పారు. ఇది నిజంగా సంతానం కోరుకునే దంపతులకు ఒక ఆశాకిరణంగా చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీపీ, సీఐడీ శిఖా గోయెల్, యశోద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తదితరులు పాల్గొన్నారు.