ఆడపిల్లకు జన్మనిచ్చిన కోడలికి అత్తమామల పూల వర్షం

Family Members Welcomed by Mother with Baby girl : ఆడపిల్ల పుట్టిందని కోడలిని అత్తామామలు వేధించడం చూశాం. కట్నం కోసం వేధించడం చూశాం.. ఆడ పిల్ల అంటేనే చిన్నచూపు చూసే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి అత్తారింటికి వెళ్లాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అమ్మాయి పుట్టిందని కోడలని వేధించే రోజులవి.. కానీ, ఇప్పుడు ఆ రోజులు మారాయి. పాత రోజుల్లోగా ఈ తరం అత్తమామలు అలా కాదంటున్నారు.. ఆడ పిల్లకు జన్మనిచ్చిన తల్లికి పూల వర్షంకురిపించారు కేసముద్రానికి చెందిన అత్తమామలు.. పైగా ఆడపిల్లకు జన్మనిచ్చిన కోడలని ఆత్మీయంగా ఇంట్లోకి స్వాగతం పలికారు.

ప్రసవం అనంతరం ఆడశిశువుతో ఇంటికి వచ్చిన తల్లికి కుటుంబ సభ్యులు పూలతో ఆహ్వానించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలంలో జరిగింది. ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందంటూ ఈ అత్తమామలు సంబరపడిపోతున్నారు. అందరిలా కాకుండా సరికొత్తగా తమ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. కేసముద్రం మండలానికి చెందిన వెలిశాల నవీన్ తో హైదరాబాద్ అమ్మాయి రమ్యతో కొన్నాళ్ల క్రితమే పెళ్లి అయింది.

ఈ దంపతులకు మూడు నెలల క్రితమే నమస్వి అనే ఆడబిడ్డ జన్మించింది. తల్లిగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి పుట్టిన బిడ్డతో వచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి రమ్యను, ఆమె భర్తతోపాటు అత్త, మామ పూలవర్షం కురిపిస్తూ ఇంట్లోకి స్వాగతం పలికారు. కోడల్ని కన్నకూతురిలా ఆదరిస్తున్న అత్తమామలను చూసి అక్కడి స్థానికులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి అత్తమామలు ఉంటే ప్రతి ఇంటి కోడలు ఎంతో సంతోషంగా ఉంటుందని అంటున్నారు.