ఆస్తి కోసం దహనసంస్కారాలు నిలిపివేత : మానవత్వం మరిచిన కొడుకులు

పాల్వంచ: సమాజంలో ఎవరూ లేక అనాధ శవాలుగా మిగులుతున్న వారు కొందరైతే, అందరూ ఉండి ఆస్తులు పంపకం జరగక పోవటంతో తల్లిదండ్రుల శవాలను అనాధలా వదిలేస్తున్న ప్రబుధ్దులు మరికొందరు ఉంటున్నారు. ఆస్తి కోసం మానవత్వం మరిచిన కొడుకులు తల్లి శవాన్ని దహనం చేయకుండా ఉంచిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది.
పాల్వంచ మున్సిపాల్టీ పరిధిలోని బంగారుజాలకు చెందిన తాటి రత్తమ్మ(70) భర్త సమ్మయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో రత్తమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు.సమ్మయ్యకు మొదటి భార్య ద్వారా ముగ్గురు కొడుకులు ఉన్నారు. రెండో భార్య తాటి రత్తమ్మకు సంతానం లేకపోవడంతో రవికుమార్ అనే అతడ్ని దత్తత తీసుకుంది. కొన్ని సంవత్సరాల కిందట భర్త సమ్మయ్య చనిపోయాడు. దాంతో ఉన్న ఆస్తిలో ఎకరా భూమిని రత్తమ్మను చివరి వరకు పోషించి, అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తే వారికి ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్మానించారు.
ఈ క్రమంలో రెండు రోజుల కిందట రత్తమ్మ అనారోగ్యంతో మరణించింది. దీంతో రత్తమ్మ దత్తత తీసుకున్న రవికుమార్ ఎకరం భూమిని తనకు ఇవ్వాలని, అంతవరకు దహన సంస్కారాలు చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. కానీ సమ్మయ్య మొదటి భార్య కు చెందిన కొడుకులు ఆస్తి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రత్తమ్మ మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేశారు. ఆస్తి తగాదా తేలకపోవడంతో మృతదేహాం రెండు రోజులుగా ఇంట్లోనే ఉంది. ఇది తెలిసిన గ్రామపెద్దలు పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. టౌన్ ఎస్‌ఐ ముత్యం రమేశ్ సోమవారం గ్రామానికెళ్లి తాటి రత్తమ్మ దత్తపుత్రుడు, మొదటి భార్య ముగ్గురు కుమారులతో మాట్లాడి, ఆస్తి పంపకాల విషయం మంగళవారం స్టేషన్‌లో మాట్లాడదామని చెప్పి దహన సంస్కారాలు జరిపించారు.