Rajnath Singh Praises Krishnam Raju : కృష్ణంరాజు గొప్ప నటుడే కాదు మానవతా వాది కూడా- రాజ్‌నాథ్ సింగ్

రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి అర్పించారు. కృష్ణంరాజు నటుడే కాదు గొప్ప మానవతా వాది అని అభివర్ణించారు.

Rajnath Singh Praises Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి అర్పించారు. కృష్ణంరాజు నటుడే కాదు గొప్ప మానవతా వాది అని అభివర్ణించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదన్నారు రాజ్ నాథ్ సింగ్. ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్తారని ఊహించలేదన్నారు. కృష్ణంరాజు ఆయన కుటుంబంతో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. బాహుబలి సినిమా రిలీజ్ కు ముందు తన దగ్గరికి వచ్చి సినిమా చూయించారని గుర్తు చేసుకున్నారు రాజ్ నాథ్ సింగ్.

అంతకుముందు కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, పిల్లలను ఆయన ఓదార్చారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే హీరో ప్రభాస్ ను కలిసి తన సంతాపం తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు నివాసంలో ఉన్నారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు.

కృష్ణంరాజు చివరి వరకు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగానూ ఉన్నారు.

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు సోమవారం ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. బీజేపీ హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. బీజేపీ నాయకులతో కృష్ణంరాజుకు మంచి సంబంధాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎంపీగా గెలిచారు.

తన పెదనాన్న కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఖంలో ఉన్నాడు. దీంతో అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్ ను కలిసి పరామర్శిస్తున్నారు. ప్రభాస్ కుటుంబాన్ని ఓదార్చారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఇలా వరుసగా సెలబ్రిటీలంతా… ప్రభాస్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.