పాతబస్తీలో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయావడం బాధాకరమని చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహా ప్రమాదస్థలిని పరిశీలించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి వివరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారని అన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారని అన్నారు. ఇవాళ ఉదయం 6.16 గంటలకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. మొత్తం 11 ఫైర్‌ ఇంజిన్లు, ఒక రోబోను వాడి మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేశారని తెలిపారు. సహాయక చర్యల్లో 70 మంది ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా చూసుకున్నారని అన్నారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి రాజనర్సింహ ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అగ్నిప్రమాద బాధితులను పరామర్శించారు. కాగా, భవనంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.